Share News

TTD : లడ్డూ తయారీకి సకాలంలో అందని నెయ్యి

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:11 AM

నెయ్యి వినియోగం, నాణ్యత పరీక్షల అంశంలో టీటీడీ పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారింది. ఇటీవల ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన నూతన పరికరాలతో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటంతో...

TTD : లడ్డూ తయారీకి సకాలంలో అందని నెయ్యి

  • కొత్త పరికరాలతో ల్యాబ్‌ పరీక్షలకు అధిక సమయం.. ఇబ్బంది పడుతున్న టీటీడీ!

తిరుమల, మార్చి 11(ఆంధ్రజ్యోతి): నెయ్యి వినియోగం, నాణ్యత పరీక్షల అంశంలో టీటీడీ పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారింది. ఇటీవల ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన నూతన పరికరాలతో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటంతో, ప్రసాదాల తయారీకి సకాలంలో నెయ్యి అందించలేకపోతోంది. శ్రీవారి అన్నప్రసాదాలతో పాటు లడ్డూప్రసాదాల తయారీ కోసం టీటీడీ ప్రతిరోజూ 12 వేల నుంచి 14 వేల కేజీల నెయ్యిని వినియోగిస్తోంది. గతంలో తిరుమలలోని ల్యాబ్‌లో నెయ్యి నాణ్యతను పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు సరైన పరికరాలు లేకపోవడంతో కల్తీ జరిగిందంటూ టీటీడీలో తీవ్రస్థాయిలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తిరుమల ల్యాబ్‌లోనే నెయ్యి నాణ్యతను వంద శాతం పరీక్షించే పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ భావించింది. ఈ క్రమంలో దాదాపు రూ.70 లక్షల విలువైన గ్యాస్‌ క్రోమాటోగ్రా్‌ఫ(జీఎస్‌), హై ఫెర్ఫార్మన్స్‌ లిక్విడ్‌ క్రోమాటోగ్రాఫ్‌ (హెచ్‌పీఎల్‌సీ)అనే రెండు పరికరాలను నేషనల్‌ డైయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు విరాళమిచ్చింది. వీటిని ఇటీవల తిరుమలలోని ల్యాబ్‌లో ఏర్పాటు చేసి పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. అయితే టెండర్‌ సరఫరాదారుల నుంచి నెయ్యి సకాలంలో తిరుమలకు చేరుతున్నప్పటికీ పరీక్షించే సమయం అధికంగా పడుతున్న క్రమంలో ప్రసాదాల తయారీకి సకాలంలో నెయ్యి చేరడం లేదని సమాచారం. నూతన పరికరాలు కావడంతో సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు అధిక సమయం పడుతున్నట్టు తెలిసింది. గత మూడురోజుల కిత్రం మాత్రమే ఈ సమస్య తలెత్తిందని, నెయ్యి విషయంలో ఎలాంటి కొరత లేదని, ప్రస్తుతం టీటీడీ వద్ద దాదాపు 23 వేల కేజీల నెయ్యి సిద్ధంగా ఉందని టీటీడీ అధికారి ఒకరు వెల్లడించారు. ఎప్పటిలానే రోజుకు 3.5 లక్షల లడ్డూలను, అన్నప్రసాదాలను దిట్టం ప్రకారం తయారు చేస్తున్నామని తెలిపారు.


  • కల్తీ నెయ్యి కేసు ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలి

  • పిటిషన్‌ దాఖలు చేసిన సిట్‌.. తీర్పు రిజర్వు

కల్తీ నెయ్యి కేసు విచారణను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ సిట్‌ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న ఏఆర్‌ డెయిరీ నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిందన్న ఆరోపణలపై తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన క్రిమినల్‌ కేసుపై స్థానిక 2వ ఏడీఎం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం సిట్‌ అధికారులు ఈ కేసును నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్‌ ఫైల్‌ చేశారు. నెయ్యి సరఫరా టెండర్ల వ్యవహారంలో నగదు అక్రమ లావాదేవీలు జరిగాయని, ఈ కారణంగా కేసు విచారణను అవినీతి కేసులు విచారించే ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై సిట్‌ తరపున, అలాగే నిందితుల తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.

Updated Date - Mar 12 , 2025 | 04:11 AM