Share News

Tenali Woman: స్కిల్‌ ప్రాజెక్ట్‌ కోసం కోటి స్థలం విరాళం

ABN , Publish Date - Jun 17 , 2025 | 04:04 AM

తెనాలి మహిళలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో భూరి విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇటీవలే పట్టణంలో రూ. 6 కోట్ల విలువైన మహిళా మండలి భవనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో మహిళలే దాన మివ్వగా..

 Tenali Woman: స్కిల్‌ ప్రాజెక్ట్‌ కోసం కోటి స్థలం విరాళం

  • తెనాలిలో ఓ మహిళ దాతృత్వం

  • కూటమి ప్రభుత్వం, మంత్రి మనోహర్‌పై నమ్మకంతో ఇచ్చామన్న దాత సువర్చల శశికిరణ్‌

  • ఆమె స్ఫూర్తితో మంత్రి మనోహర్‌ 10 లక్షల విరాళం

తెనాలి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): తెనాలి మహిళలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో భూరి విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇటీవలే పట్టణంలో రూ. 6 కోట్ల విలువైన మహిళా మండలి భవనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో మహిళలే దాన మివ్వగా.. వారి బాటలోనే తాజాగా మరో మహిళ నడిచారు. ప్రభుత్వానికి రూ. కోటి విలువైన భూమిని దానమిచ్చారు. మహిళల ఆర్థిక ప్రగతికి, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ మండలం కొలకలూరుకు చెందిన పొన్నుకంటి సువర్చల శశికిరణ్‌ తన ఎకరం భూమితో సహా దారి కోసం అవసరమైన మరి కొంత భూమిని కూడా కొని మరీ ప్రభుత్వానికి అందజేశారు. భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను దాత సువర్చల శశికిరణ్‌ మంత్రి మనోహర్‌ చేతుల మీదుగా సబ్‌కలెక్టర్‌ సంజన సింహా, తహసీల్దార్‌ గోపాలకృష్ణలకు అందించారు. కూటమి ప్రభుత్వంపైన, మంత్రి మనోహర్‌పైన ఉన్న నమ్మకంతో, తమ గ్రామం కొలకలూరులో మహిళల అభివృద్ధి కోసం తన భూమిని విరాళంగా ఇచ్చినట్లు సువర్చల పేర్కొన్నారు. తన భూమి ఔటర్‌రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉందని, భవిష్యత్‌లో రూ. కోట్లు విలువ చేస్తుందని స్థానికులు కొందరు చెప్పినా కూడా వినకుండా ప్రాజెక్టు భవనాల నిర్మాణాల కోసంముందుకొచ్చానన్నారు. తమ బంధువులు, కుటుంబీకులు దీనికి కలిసి రావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ ప్రభుత్వ కాలంలోనే అభివృద్ధి చేయగలిగితే తన ఆలోచనకు కార్యరూపం వచ్చినట్లు అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.


సెర్ప్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు: మంత్రి మనోహర్‌

దాత ఇచ్చిన భూమిలో స్కిల్‌ ప్రాజెక్ట్‌ను సెర్ప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి మనోహర్‌ తెలిపారు. మూడు నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసి ఒక విభాగంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, మరో విభాగంలో మహిళలకు స్వయం ఉపాధి, ఇంకో దానిలో సోలార్‌ పవర్‌కు సంబంధించినవి ఏర్పాటు చేయదలిచామన్నారు. ఓ మధ్య తరగతి మహిళ రూ. కోటి విలువైన భూమిని అప్పగించడం తనకు స్ఫూర్తిని కలిగించిందని చెప్పారు. ప్రాజెక్టు భవన నిర్మాణం వ్యయంలో తన వంతుగా రూ.10 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వరుసగా దాతలు ముందుకు రావడం కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని, వారి ఆశయాలను ఎక్కడా వమ్ముకానివ్వకుండా నెరవేర్చుతామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో నేతల భూ కబ్జాలు, అనేక కుంభకోణాలే చూశామనని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వానికి ప్రజలు సహకారం అందించడం చూస్తున్నామని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 17 , 2025 | 04:05 AM