Share News

AP DGP Harish Kumar Gupta: లొంగిపోండి.. లేదంటే లొంగదీస్తాం

ABN , Publish Date - Jul 27 , 2025 | 03:09 AM

ప్రజల్లో మావోయిస్టు పార్టీ ఆదరణ కోల్పోయింది. వారి సిద్దాంతాలకు కాలం చెల్లింది. రిక్రూట్‌మెంట్లు ఆగిపోయాయి. హింసతో ప్రగతి సాధ్యం కాదు. ఆయుధాలు వీడి జనజీవన...

 AP DGP Harish Kumar Gupta: లొంగిపోండి.. లేదంటే లొంగదీస్తాం

  • మావోయిస్టులకు ఏడు నెలలే గడువు

  • హింస వీడి జనంలోకి రావాలి: డీజీపీ

  • డీజీపీ గుప్తా ముందు లొంగిపోయిన తూర్పు బస్తర్‌ ఇన్‌చార్జి కమలేశ్‌

  • 13 మంది మావోయిస్టులకు రూ.22 లక్షల చెక్కులు పంపిణీ

అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): ‘ప్రజల్లో మావోయిస్టు పార్టీ ఆదరణ కోల్పోయింది. వారి సిద్దాంతాలకు కాలం చెల్లింది. రిక్రూట్‌మెంట్లు ఆగిపోయాయి. హింసతో ప్రగతి సాధ్యం కాదు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. దీనిని ఏడు మాసాల సమయం మాత్రమే ఉంది. అలా కాదని, హింసను కొనసాగిస్తే లొంగదీసుకుంటాం.’ అని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా మావోయిస్టులను హెచ్చరించారు. మూడున్నర దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసి తూర్పు బస్తర్‌ డివిజనల్‌ కమిటీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న రాష్ట్ర జోనల్‌ కమిటీ సభ్యుడు కమలేశ్‌, ఆయన జీవిత భాగస్వామి అరుణ(డివిజనల్‌ కమిటీ సభ్యురాలు) డీజీపీ సమక్షంలో శనివారం విజయవాడలో లొంగిపోయారు. ఈ సందర్భంగా విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో డీజీపీ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల ఉదయ్‌, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అరుణ, జగన్‌.. డివిజనల్‌ కమిటీ కార్యదర్శి రమేశ్‌ ఉన్నారు. మరో ఏడుగురిని అరెస్టు చేశాం. 40 మంది లొంగిపోయారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. ఏపీకి చెందిన మరో 20 మంది మావోయిస్టులు బస్తర్‌లో ఉన్నారు. వారంతా లొంగిపోవాలి’ అని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో లొంగిపోయిన 13 మందికి రూ.22 లక్షల చెక్కులు అందజేశారు. ఏడాదిలో 48 మంది లొంగిపోయారని, రూ.64 లక్షలు అందజేశామని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో త్వరలో గ్రేహౌండ్స్‌ కార్యాలయ నిర్మాణానికి రూ.294 కోట్లతో భూమి పూజ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీజీ మధుసూదన్‌ రెడ్డి, ఐజీలు సీహెచ్‌ శ్రీకాంత్‌, పీహెచ్‌డీ రామక్రిష్ణ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు, విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, పలువురు ఎస్పీలు పాల్గొన్నారు.

Untitled-1 copy.jpg


గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం..

గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ తెలిపారు. ఏడాది క్రితం వరకు 10 వేల ఎకరాల్లో సాగైన గంజాయి.. ఇప్పుడు 100 ఎకరాలకు పరిమితమైందన్నారు. అది కూడా అత్యంత మారుమూల అటవీ ప్రాంతంలోనే సాగుతోందని గుర్తించినట్టు చెప్పారు. స్థానిక గిరిజనులను మభ్యపెట్టి గంజాయి సాగుకు ప్రోత్సహించే స్మగ్లర్లపై నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రోపిక్‌ పదార్థాల అక్రమ రవాణా నిరోధక చట్టం(పిట్‌ ఎన్‌డీపీఎస్‌) ప్రయోగించి జైలుకు పంపుతున్నామని చెప్పారు. మరోవైపు గిరిజన రైతులకు ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహకాలు ఇప్పించడం మంచి ఫలితాన్నిస్తోందని తెలిపారు. అక్కడి యువతకు విశాఖ పోర్టు సహకారంతో స్కిల్‌ డెవలప్మెంట్‌లో శిక్షణ ఇస్తున్నట్లు డీజీపీ తెలిపారు. శిక్షణ పొందిన 1,700 మంది యువకుల్లో 1,042మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారని చెప్పారు.



ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

Updated Date - Jul 27 , 2025 | 03:16 AM