Botsa Satyanarayana: కూటమి ఏడాది పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:25 AM
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.

డ్రగ్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో విశాఖ
పీ 4 ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు: బొత్స
విశాఖపట్నం, జూలై 12(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బీచ్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కూటమి నేతల అరాచక పాలనతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. రాష్ట్రప్రభుత్వం పనితీరు పట్ల ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట్లాడేంత వరకూ రైతుల సమస్యలు ప్రభుత్వానికి గుర్తుకు రాకపోవడం శోచనీయం. రూ.4 మద్దతు ధరతో 2.3 లక్షల టన్నుల మామిడి కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఎక్కడ చేశారో చెప్పాలి. విశాఖ అభివృద్ధిలో కాకుండా డ్రగ్స్‌లో అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనట్టు చిన్నారుల హత్యలు, మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. దీనికి కారణం పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకపోవడమే. టీడీఆర్ బాండ్‌లు ఇష్టారాజ్యంగా జారీ చేయడంతోపాటు భూకబ్జాలపై పత్రికల్లో నిత్యం కథనాలు వస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే రూ.1.5 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బు ఏం చేశారు? పీ-4 కార్యక్రమం ఎందుకనేది ఎవరికీ అర్థం కావడం లేదు. యోగాంధ్ర కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ రికార్డు కోసం రూ.300 కోట్లతో అట్టాహాసంగా నిర్వహించారు. దీనివల్ల విశాఖకు కలిగిన ప్రయోజనం ఏమిటి? కూటమి పాలన పూర్తిగా పడకేసింది’ అని బొత్స విమర్శించారు.