Share News

Space City: అంతరిక్ష రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం

ABN , Publish Date - Jul 14 , 2025 | 05:12 AM

రాష్ట్రంలో అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ ప్రయోగాలకు అద్భుతమైన వాతావరణం ఉందని పరిశ్రమల శాఖ తెలిపింది. ప్రధాన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు అందిస్తూ...

Space City: అంతరిక్ష రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం

  • శ్రీసత్యసాయి, తిరుపతిలో స్పేస్‌ సిటీలు ఏర్పాటు

  • 2033 నాటికి రూ.3.77 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ ప్రయోగాలకు అద్భుతమైన వాతావరణం ఉందని పరిశ్రమల శాఖ తెలిపింది. ప్రధాన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు అందిస్తూ పాలసీని రూపొందిస్తున్న పరిశ్రమల శాఖ.. తాజాగా అంతరిక్ష రంగంలోనూ భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా విధాన పత్రాన్ని విడుదల చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్‌ వాటా రెండు శాతమే. అయితే.. ఇస్రో, న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సఐఎల్‌), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ సహకారంతో చేపడుతున్న పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎ్‌సఎల్వీ), స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎ్‌సఎల్వీ), నెక్స్ట్‌ జనరేషన్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎన్‌జీఎల్వీ) వంటి ప్రయోగాలతో అంతర్జాతీయ వేదికపై ఇప్పుడిప్పుడే భారత్‌ పేరు మార్మోగుతోంది. ఈ క్రమంలో అంతరిక్ష పరిశోధనా రంగాల్లో ఏపీని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం విద్యార్థులు, ఔత్సాహికుల సృజనాత్మకతను గుర్తించి వారికి అంతరిక్ష రంగంలో ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. అంతరిక్షం రంగంలో 2033 నాటికి రూ3.77 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించేలా కార్యాచరణకు సిద్ధమైంది. ముఖ్యంగా ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేలా పరిశ్రమల శాఖ నూతన విధానాన్ని రూపొందించింది.


శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్‌ సిటీలు స్థాపించడం ద్వారా అంతరిక్ష పరిశోధనా రంగంలో పెట్టుబడులు సాధించాలని భావిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలో హైదరాబాద్‌ - బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఆధారంగా చేసుకుని ఇస్రో సహకారంతో, తిరుపతిలో షార్‌ సమన్వయంతో స్పేస్‌ సిటీలు స్థాపించాలని నిర్ణయించింది. స్పేస్‌ టెక్నాలజీ తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకునే దిశగా కార్యచరణకు సిద్ధమైంది.

స్టార్ట్‌పలకు 15 లక్షల వరకూ ప్రోత్సాహం

స్పేస్‌ సిటీ రంగంలో స్టార్ట్‌పలకు పరిశ్రమల శాఖ ప్రాథమికంగా రూ.2 లక్షలు, క్రమంగా రూ.15 లక్షల వరకూ ప్రోత్సాహం అందిస్తుంది. స్టార్ట్‌పలు స్థాపించే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రూ.20 లక్షల దాకా ప్రోత్సాహం అందించనుంది. రెండేళ్లపాటు స్టార్ట్‌పలు నిర్వహిస్తే చిన్న సూక్ష్మ వ్యాపారంగానూ, రూ.125 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకూ టర్నోవర్‌ ఉంటే భారీ వ్యాపారంగానూ, రూ.500 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన సంస్థలను మెగా వ్యాపార సంస్థలుగానూ గుర్తిస్తుంది.

Updated Date - Jul 14 , 2025 | 05:14 AM