CS K. Vijayanand: రెవెన్యూ లోటును సర్దుబాటు చేసుకుంటాం
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:49 AM
రెవెన్యూ లోటును సర్దుబాటు చేసుకుంటాం. వినియోగదారుడిపై భారం వేయం అని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.

వినియోగదారుడిపై భారం వేయం: విజయానంద్
అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ‘రెవెన్యూ లోటును సర్దుబాటు చేసుకుంటాం. వినియోగదారుడిపై భారం వేయం’ అని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థల ఆదాయ వ్యయాల నివేదికను సమీక్షించే విధానం 2006-07 నుంచి అమలులోకి వచ్చింది. ఆమేరకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి రెవెన్యూ గణాంకాలను సమర్పించాలి. అందులో భాగంగానే 2019-20 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకూ ఆర్థికాంశాల నివేదికను ఈఆర్‌సీకి అందజేశాం. నివేదికలో పేర్కొన్న రెవెన్యూ లోటును వచ్చే వార్షిక ఆదాయ వ్యయాల నివేదిక(ఏఆర్‌ఆర్)లో సర్దుబాటు చేసుకుంటాం. ఈ నివేదికలపై ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటాం. ఈఆర్‌సీ ఇచ్చిన నోటీసుకు ప్రభుత్వ నిర్ణయాన్ని 29న వెల్లడిస్తాం’ అని విజయానంద్ పేర్కొన్నారు.