PV Contributions: పీవీ భారత డెంగ్ జియావోపింగ్
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:45 AM
ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశం రూపురేఖలు మార్చిన మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు..

ఆర్థిక సంస్కరణలతో దేశం రూపురేఖలను మార్చారు
ఆయన రాజకీయ పరిపక్వతకు, సమతుల్యతకు ప్రతీక
దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు.. తెలుగు జాతి గర్వించదగ్గ మేధావి
విదేశీ పెట్టుబడులు ఆహ్వానించారు.. ఐటీ విప్లవానికి నాంది పలికారు
ఢిల్లీలో సీఎం చంద్రబాబు పీవీ స్మారకోపన్యాసం
న్యూఢిల్లీ, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశం రూపురేఖలు మార్చిన మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు.. ఒకప్పటి చైనా అధినేత డెంగ్ జియావోపింగ్ లాంటి నాయకుడని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. మంగళవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఆయన పీవీ స్మారకోపన్యాసం చేశారు. మైనారిటీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ సోషలిస్టులు, కమ్యూనిస్టులు, కార్పొరేట్లు అందరినీ కలుపుకుని పోయి సమర్థ నాయకత్వాన్ని అందించిన పీవీ నిజమైన తెలుగుబిడ్డ అని చెప్పారు. హిందీ నేర్చుకోవడాన్ని వివాదాస్పదం చేస్తున్న ప్రస్తుత తరుణంలో 17 భాషలు తెలిసిన ఆయన దేశానికి మార్గదర్శకుడని కొనియాడారు. పీవీ ప్రారంభించిన సంస్కరణలను వాజపేయి కొనసాగించారని, 1995లో సీఎం అయిన తర్వాత తాను రెండో తరం సంస్కరణలను ప్రవేశపెట్టానని గుర్తుచేశారు. లైసెన్స్ రాజ్‌ను అంతం చేసిన పీవీ సంస్కరణల ప్రభావాన్ని మనం నేడు అనుభవిస్తున్నామని తెలిపారు. పీవీ దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడని, రాజకీయ పరిపక్వతకు, సమతుల్యతకు ప్రతీక అని అన్నారు. భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని జీర్ణించుకున్న ఆయన మొత్తం తెలుగుజాతి గర్వించదగ్గ మేధావి అని, ఆయన జీవితం అందరికీ ప్రేరణ దాయకమని పేర్కొన్నారు. 1991లో అసాధారణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న భారత్... బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాల్సివచ్చిందని, అలాంటి పరిస్థితుల నుంచి పీవీ దేశాన్ని గట్టెక్కించారని, విదేశీ పెట్టుబడులు ఆహ్వానించారని, ఐటీ విప్లవానికి నాంది పలికారని సీఎం గుర్తు చేశారు.
జనాభా ఒక వరం
భారత దేశానికి జనాభా ఒక వరమని, ఆర్థిక సంస్కరణలు, ఐటీ రంగంలో విజయాలు దేశాన్ని అగ్రగామిగా మార్చాయని చంద్రబాబు తెలిపారు. వాజపేయి హయాంలో జాతీయ రహదారి విధానాన్ని, అందులో తన పాత్రను ఆయన ఆసక్తికరంగా వివరించారు. దేశంలో అప్పట్లో రహదారులు అస్తవ్యస్తంగా, గుంతలతో ఉండేవని, తాను మలేసియా వెళ్లినప్పుడు అక్కడ సముద్రతీరంలో 8 లేన్ల రహదారుల్ని చూసిన తర్వాత వాజపేయికి వచ్చి వివరించానని చెప్పారు. వాజపేయి తన సూచనలను ఆమోదించడంతో నెల్లూరు- చెన్నై జాతీయ రహదారితో స్వర్ణ చతుర్భుజి ప్రారంభమైందని చెప్పారు. టెలికమ్యూనికేషన్ విధానంపై తాను సమర్పించిన కమిటీ నివేదిక తర్వాతే దేశంలో సెల్ ఫోన్ విప్లవం ప్రారంభమైందని, అందరికీ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఒకరినొకరు చూడకుండా ఉండగలరు కానీ, సెల్‌ఫోన్ లేకుండా మాత్రం ఉండలేరని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. దేశాభిమానం, అంతర్జాతీయ గౌరవం, బలమైన విదేశాంగ సంబంధాలు ప్రధాని మోదీ సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందడం కాదు, ప్రతి పౌరుడూ, ప్రతి ప్రాంతం, ప్రతి రంగం సమానంగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా తెలిపారు. సమస్యల పరిష్కారం, నాయకత్వం కోసం ప్రపంచం ఇప్పుడు భారత్‌వైపు చూస్తోందని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ, స్వర్ణాంధ్రప్రదేశ్ తన లక్ష్యాలని చంద్రబాబు ప్రకటింటారు. ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన రాష్ట్రంగా ఏపీని మారుస్తామని తెలిపారు. సమాజంలో అగ్రస్థానంలో ఉన్న పది శాతం సంపన్నులు అట్టడుగు స్థానంలో ఉన్న 10 శాతం పేదలకు చేయూతనివ్వాలని కోరారు. తన సంపదలో 75శాతం సామాజిక సేవా కార్యక్రమాలకు అంకితం చేస్తున్న బిల్ గేట్స్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, మనుమడు సుభాశ్‌ను చంద్రబాబు ఈ సందర్భంగా సన్మానించారు. చంద్రబాబు ఆధునిక హైదరాబాద్ నిర్మాత అని, ఐటీ, టెలికమ్యూనికేషన్ల విప్లవానికి, జాతీయ స్వర్ణ చతుర్భుజికి కారకుడని ప్రధానమంత్రి సంగ్రహాలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి నృపేన్ మిశ్రా ప్రశంసించారు.