TDP Disciplinary Committee: సీనియర్ నేతలూ గీత దాటితే ఎలా
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:22 AM
పులివెందుల టీడీపీ నేత, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి బుధవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు.

పులివెందుల టీడీపీ నేత పార్థసారథితో క్రమశిక్షణ కమిటీ
అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): పులివెందుల టీడీపీ నేత, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి బుధవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేశ్‌పై పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనను కమిటీ పిలిపించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, క్రమశిక్షణ కమిటీ సభ్యులు వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, కొనకళ్ల నారాయణ ఎదుట హాజరైన పార్థసారథి రెడ్డి వివరణ ఇస్తూ... ‘నేను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తొలి నుంచీ టీడీపీలోనే ఉన్నా. సస్పెండ్ చేసినా పార్టీనే నమ్ముకుని ఉంటా’ అని తెలిపారు. సీనియర్ నాయకులు ఆచితూచి మాట్లాడాలని, పార్టీ గీత దాటొద్దని పల్లా శ్రీనివాస్ ఆయనకు స్పష్టం చేశారు.