Deputy Pawan Kalyan: కడపలో స్మార్ట్ సెంట్రల్ కిచెన్ రెడీ
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:42 AM
బడి పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని శుభ్రమైన, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో స్మార్ట్ సెంట్రల్ కిచెన్ నిర్మించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

పవన్ సొంత నిధులతో నిర్మాణం
లోకేశ్ సంస్కరణలకు కచ్చితమైన ఫలితాలంటూ ట్వీట్
అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): బడి పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని శుభ్రమైన, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో స్మార్ట్ సెంట్రల్ కిచెన్ నిర్మించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఎక్స్ వేదికగా వీడియో పోస్టు చేశారు. స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి తన వ్యక్తిగత నిధులను అందించినట్లు తెలిపారు. ఇప్పుడు అక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతోందని, పోషక విలువలతో, రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులను నియమించారని చెప్పారు. ఈ కిచెన్ కచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. కడపలో స్మార్ట్ సెంట్రల్ కిచెన్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను ఆయన ఎక్స్ వేదికగా పవన్ అభినందించారు. అలాగే, సీఎం చంద్రబాబు మార్గదర్శకంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ తీసుకొస్తున్న సంస్కరణలు చక్కటి ఫలితాలిస్తాయని కొనియాడారు.