Nilayapalem Vijaykumar: పరకామణి దొంగకు వైసీపీ గజదొంగల అండ
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:50 AM
పవిత్రమైన శ్రీవారి ఆలయంలో వైసీపీ నాయకులు రూ.వందల కోట్లు స్వాహా చేశారని, పరకామణి దొంగకు వైసీపీ గజదొంగల బ్యాచ్ అండగా నిలుస్తోందని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం...
శ్రీవారి సొత్తు దోచేసి.. ఆస్తులు ఇస్తే దొంగ దొర అయిపోతాడా?
దొంగతనం చేసిన సొమ్ముతో స్థిరాస్తులు కొన్నారు
వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డిపైసమగ్ర విచారణ చేయించాలి: నీలాయపాలెం
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): పవిత్రమైన శ్రీవారి ఆలయంలో వైసీపీ నాయకులు రూ.వందల కోట్లు స్వాహా చేశారని, పరకామణి దొంగకు వైసీపీ గజదొంగల బ్యాచ్ అండగా నిలుస్తోందని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ విమర్శించారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. భక్తులు ఇచ్చే కానుకలు, డబ్బులు, డాలర్లు, బంగారం ఇతరత్రా వాటిని గత 15 ఏళ్లుగా దొంగతనం చేస్తున్నట్లు తేలిన దొంగకు శిక్ష వేయడం పోయి వైసీపీ నాయకులు వెనకేసుకొస్తున్నారని అన్నారు. రవికుమార్ అనే గుమస్తా.. శ్రీవారి వారి సొమ్ము దోచుకుని తిరుపతి, చెన్నై, విజయవాడల్లో విలువైన స్థలాలు, విల్లాలు కొనుగోలు చేశారని, అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి శిక్షించాల్సింది పోయి వైసీపీకి చెందిన ఇద్దరు మాజీ టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, నాటి ఈవో ధర్మారెడ్డి కలిసి అతనికి అండగా నిలిచారని విమర్శించారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు పెట్టిన 23 రోజుల తర్వాత లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని నిందితుడిని వదిలేశారని అన్నారు. టీటీడీ బోర్డు కూడా రాజీకి అంగీకరించిందని అబద్ధాలు చెప్పారని అన్నారు. ‘‘స్వామి వారి ఆస్తులు దొంగతనం చేసి, ఆస్తులు రాసిస్తే దొంగ దొర అయిపోతాడా?.’’ అని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దొంగతనం చేసిన వ్యక్తి.. తన ఆస్తులను టీటీడీకి రాసిస్తే రూ.కోట్ల స్టాంపు డ్యూటీని భరించిన నాటి టీటీడీ బోర్డు సభ్యుడి పాత్రను కూడా నిగ్గుతేల్చాలని విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.