Share News

Montha Cyclone Alert: తీవ్ర తుఫానుగా మారనున్న.. మొంథా

ABN , Publish Date - Oct 27 , 2025 | 05:15 AM

బంగాళాఖాతంలో మొంథా తుఫాన్‌ అలజడి సృష్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో మరింత బలపడి..

Montha Cyclone Alert: తీవ్ర తుఫానుగా మారనున్న.. మొంథా

  • గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు!

  • రేపు కాకినాడ-తుని మధ్య తీరం దాటే అవకాశం

  • కోస్తాపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా

  • పలు జిల్లాల్లో అసాధారణ వర్షాలు?

  • సముద్రంలోకి వెళ్లొద్దని జాలర్లకు హెచ్చరిక

  • ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక

  • నేడు, రేపు అతి భారీ వర్షాలు: విపత్తుల సంస్థ

  • సహాయ చర్యలకు 19 కోట్లు విడుదల

  • పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు

  • డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

విశాఖపట్నం/అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో మొంథా తుఫాన్‌ అలజడి సృష్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో మరింత బలపడి ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. అనంతరం ఆదివారం రాత్రికి ఇది తుఫానుగా మారినట్టు అమెరికాకు చెందిన వాతావరణ సంస్థ జేటీడబ్ల్యూసీ(జాయింట్‌ టైఫూన్‌ వార్నింగ్‌ సెంటర్‌) ప్రకటించింది. అయితే, భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ విషయాన్ని నిర్ధారించలేదు. ఈ తుఫానుకు థాయ్‌లాండ్‌ దేశం సూచించిన ‘మొంథా’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది చెన్నైకి 720 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 790 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా, కాకినాడకు 780 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. గంటకు ఆరు నుంచి 10 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు వస్తోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా బలపడి కోస్తాంధ్రకు దగ్గరగా రానున్నది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద (ఒక అంచనా మేరకు కాకినాడ-తుని మధ్య) తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. అయితే తీవ్రతుఫాన్‌ విశాఖపట్నం-కాకినాడ మధ్య తీరందాటే అవకాశం ఉందని కొందరు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.


మంగళవారం ఉదయం కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నాయి. మధ్యాహ్నం తర్వాత గాలుల వేగం పెరిగి, తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ., అప్పుడప్పుడు 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సోమవారం నుంచి పలు జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి రావాలని హెచ్చరించింది. కోస్తాలో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఆదివారం వర్షాలు కురిశాయి. సోమవారం నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయి. సోమవారం కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుంభవృష్టిగా, కోస్తాలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ., అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ అంబేడ్కర్‌, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టి, కోస్తాలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమలోని తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అతిభారీ వర్షాలు, రాయలసీమలో మిగిలిన జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అతిభారీగా, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.


montha-allert.jpg

గురువారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుఫాన్‌ ప్రభావంతో రానున్న 48గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే, తీరం వెంబటి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సహాయక చర్యల కోసం తీర ప్రాంత జిల్లా కేంద్రాల్లో 9 ఎస్‌డీఆర్‌ఎఫ్‌, 7 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. తుఫాన్‌ సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం ప్రభుత్వం తక్షణం రూ.19 కోట్లు విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున, మిగిలిన 14 జిల్లాలకు రూ.50లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ నిధులను జిల్లా కలెక్టర్లు డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. బాధితుల్ని సహాయ శిబిరాలకు తరలించడం, వారికి రక్షిత తాగునీరు, ఆహారం, పాలు అందించడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, రోడ్లు, ఇతర అత్యవసర సేవలకు ఈ నిధులు వినియోగించుకునేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.


డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

తుఫాను నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో జరగాల్సిన డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలు సి-16, సి-20లను వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సవరణ షెడ్యూలను తర్వాత విడుదల చేస్తామని పేర్కొంది.

విద్యా సంస్థలకు సెలవులు

మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, కడప జిల్లాల్లో పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలకు సెలవులిచ్చారు. ఆయా జిల్లాలపై ప్రభావం తీవ్రత ఆధారంగా సోమవారం నుంచి రెండు, మూడు రోజులు సెలవులు ప్రకటించారు.

Updated Date - Oct 27 , 2025 | 06:21 AM