Share News

Monsoon Cyclone: తుఫాను గాయం.. సర్కారు సాయం

ABN , Publish Date - Oct 30 , 2025 | 07:14 AM

మొంథా తుఫాన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతోపాటు ప్రజలను అప్రమత్తం చేయడంతో చాలా వరకూ ప్రాణనష్టాన్ని నివారించగలిగారు. అయితే, కొన్ని చోట్ల అకస్మాత్తుగా జరిగిన ఘటనలతో....

Monsoon Cyclone: తుఫాను గాయం.. సర్కారు సాయం

  • భారీ విధ్వంసం సృష్టించిన మొంథా తుఫాను

  • 1.23 లక్షల హెక్టార్లలో పంట నష్టం

  • వెన్నుదశలోనే వొరిగిపోయిన వరి

  • చేతికి అందకుండాపోయిన పత్తి

  • కల్లాల్లోనే మొక్కజొన్నకు మొలకలు

  • చెట్లు, ఇళ్లు కూలి ఏడుగురు మృతి

  • అత్యధికంగా శ్రీశైలంలో 27 సెం.మీ. వర్షం

  • ఒంగోలు నగరాన్ని చుట్టుముట్టిన నీరు

  • రహదారులకే రూ.1,424 కోట్ల నష్టం

మొంథా తుఫాన్‌ పెను విధ్వంసమే సృష్టించింది. లక్షల ఎకరాల్లో పంట నీటిపాలైంది. రైతన్నకు కన్నీరే మిగిలింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఉమ్మడి కృష్ణాతోపాటు రాయలసీమలోనూ భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం దాకా... తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి. వందలసంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఏజెన్సీతోపాటు పలుచోట్ల పూరిగుడిసెలు దెబ్బతిన్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో 24 గంటల్లో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు... 25 సెంటీమీటర్ల వానతో జలమయమైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. దీని ఫలితంగా వాగులూ వంకలూ పొంగిపొర్లాయి.

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

మొంథా తుఫాన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతోపాటు ప్రజలను అప్రమత్తం చేయడంతో చాలా వరకూ ప్రాణనష్టాన్ని నివారించగలిగారు. అయితే, కొన్ని చోట్ల అకస్మాత్తుగా జరిగిన ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, కాకినాడ, నంద్యాల జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గల్లంతయ్యారు. కాకినాడ జిల్లా రూరల్‌ మండలానికి చెందిన పొలవరపు సాయి(12) యేలేరు కాలవలో పడి మరణించారు. కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలానికి చెందిన జి.వీరవేణి ఇంటి ముందు తాటిచెట్టు పడి మరణించారు. కృష్ణా జిల్లాలో కృత్తివేన్ను మండలానికి చెందిన కోయ సుబ్బారావు(60) కొబ్బరిచెట్టు పడి మరణించారు.


నెల్లూరు జిల్లాలో మనుబోలు మండలానికి చెందిన కృష్ణమనేని జయమ్మ(60) పశువులు మేపి ఇంటికి తిరిగి వస్తూ పొట్టేలు వాగులో కొట్టుకుపోయి మరణించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలానికి చెందిన ఎస్‌.లావణ్య వలహగడ్డ వాగులో పడి మరణించారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన మర్రెడ్డి రాములమ్మ(90) బుధవారం ఉదయం ఇంట్లో పాత మిద్దె కూలి మరణించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కౌండ్రగుంట సీతమ్మ(49) మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించారు. ఉదయానికి సీతమ్మ మరణించారు. విద్యుదాఘాతంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతుండగా, అధికారులు మాత్రం గుండెపోటుతో మరణించి ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు.

గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు..

నంద్యాల జిల్లా పాములపాడు మండలం భవనాశి వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యారు. కాకినాడలోని కుంభాభిషేకం రేవు వద్ద జి.శ్రీరామ్‌(23) బీచ్‌లో లంగర్‌ వేసే ప్రయత్నంలో గల్లంతయ్యారు. ఆయన కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలిస్తున్నారు.

కాపాడిన పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌

ఆపదలో చిక్కుకున్న 38 మందిని పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. బాపట్ల జిల్లా పర్చూరు వాగులో పడి కొట్టుకుపోతున్న షేక్‌ మున్నా అనే వ్యక్తిని డ్రోన్‌ సహాయంతో గుర్తించిన పోలీసులు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ టీం సాయంతో రక్షించారు.


విద్యుత్తుశాఖకు 18 కోట్ల నష్టం

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను కారణంగా విద్యుత్తు శాఖకు ప్రాథమిక అంచనా మేరకు రూ.18 కోట్ల మేర నష్టం వాటిల్లింది. సబ్‌స్టేషన్లు, ఫీడర్లు దెబ్బతినడం, గాలులకు విద్యుత్తు స్తంభాలు నేలకొరగడం, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడం వల్ల ఈ నష్టం వాటిల్లింది. ఈపీడీసీఎల్‌ పరిధిలో అత్యధికంగా రూ.10.47 కోట్ల నష్టం వాటిల్లగా, సీపీడీసీఎల్‌ పరిధిలో రూ.65.19 లక్షలు, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో రూ.85.25 లక్షల నష్టం వాటిల్లింది. గురువారం నాటికి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నూరు శాతం విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ స్పష్టం చేశారు. 11 వేల మంది సిబ్బంది తుఫాను అనంతర పరిస్థితులను చక్కదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. విద్యుత్తుసరఫరా పునరుద్ధరణ పనులను పర్యవేక్షించిన డిస్కంల సీఎండీలను అభినందించారు.

Updated Date - Oct 30 , 2025 | 07:17 AM