Minister Sandhya Rani: రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 05:48 AM
నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే నాపైనా, నా కొడుకుపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేని విషయంలో ఇరికించారు...
నా కొడుకుని అనవసరంగా ఇరికించారు
నా జోలికొస్తే ఊరుకోను: మంత్రి గుమ్మిడి
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే నాపైనా, నా కొడుకుపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేని విషయంలో ఇరికించారు’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘ఎలాంటి పాపం తెలియని తన కుమారుడి జోలికొస్తే ఊరుకునేది లేదు. రాజకీయంగా నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. జగన్ మీడియా నన్ను, నా కుమారుడిని లక్ష్యంగా చేసుకొని గతంలోనూ తప్పుడు వార్తలు రాసింది. విజయవాడలో నా కుమారుడు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటే తిరుపతిలో చిందులు అని రాశారు. నేను కేసు పెట్టేందుకు సిద్ధమవ్వడంతో నా కాళ్లు పట్టుకుని బలిమలాడుకుని క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు మళ్లీ నా కుమారుడిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు వచ్చిన వెంటనే నా వ్యక్తిగత సిబ్బందిని పక్కన పెట్టాను. పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆరోపణల్లో నిజాలను నిగ్గుతేల్చాలని కోరాను. వారం రోజుల్లో వాస్తవం ఏమిటనేది ప్రజలకు తెలుస్తుంది’ అని మంత్రి సంధ్యారాణి తెలిపారు.