అర్ధరాత్రి హైడ్రామా
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:56 PM
ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇనచార్జి చిప్పగిరి లక్ష్మినారాయణ హత్య కేసులో హైడ్రామా సాగింది.

చిప్పగిరి లక్ష్మినారాయణ హత్య ప్రదేశంపై సర్వే
ఆర్డీఓల సమక్షంలో అనంతపురం, కర్నూలు జిల్లా సరిహద్దుల కొలత
కర్నూలు జిల్లా పరిధిగా నిర్ధారణ
కేసు గుంతకల్లు స్టేషన నుంచి చిప్పగిరికి మార్పు
గుంతకల్లు/ఆలూరు/చిప్పగిరి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇనచార్జి చిప్పగిరి లక్ష్మినారాయణ హత్య కేసులో హైడ్రామా సాగింది. హత్య జరిగిన ప్రదేశం అనంతపురం జిల్లా గుంతకల్లు రూరల్ పోలీసు స్టేషన పరిధిగా భావించి ఇక్కడి పోలీసులు కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ ప్రదేశం విషయంగా సందేహాలు ఉండటంతో ఆదివారం రాత్రి సర్వే చేపట్టారు. అర్ధరాత్రిదాకా గుంతకల్లు, పత్తికొండ రెవెన్యూ డివిజనల్ అధికారులు, కర్నూలు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే, రెండు జిల్లాల సర్వే అధికారులు, తహసీల్దార్లు, గుంతకల్లు డీఎస్పీ, సీఐలు సర్వేలో పాల్గొన్నారు. రోవర్ ద్వారా మ్యాప్ సర్వే చేపట్టి ఆ ప్రదేశం చిప్పగిరి పోలీసు స్టేషన పరిధిలోకి వస్తుందని అర్ధరాత్రి 2 గంటలకు తేల్చారు. ఈ మేరకు అధికారికంగా రిపోర్టును విడుదల చేశారు.
హత్య జరిగిన ప్రదేశం చిప్పగిరి పోలీసు స్టేషన పరిధిలోకి మారడంపై బాధితవర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది. కేసు గుంతకల్లులోనే నమోదు చేయాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని లక్ష్మినారాయణ కుటుంబం, బంధువులు డిమాండ్ చేశారు. చిప్పగిరి స్టేషనలో విచారణ జరిగితే తమకు న్యాయం జరగదని సందేహాన్ని వ్యక్తంచేశారు. ఓ పోలీసు అధికారి కారణంగా తమకు అన్యాయం జరిగిందనీ, ఆయన ఆధ్వర్యంలో విచారణ పారదర్శకంగా సాగుతుందన్న నమ్మకం లేదన్నారు. ఉన్నతాధికారితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను పోలీసులు బాధిత వర్గానికి వివరించారు.
నలుగురిపై కేసు
చిప్పగిరి లక్ష్మినారాయణ హత్య ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆయన కుమారుడు వినోద్‌కుమార్ నుంచి చిప్పగిరి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. చిప్పగిరికి చెందిన వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జున చౌదరి, కొండా రామాంజనేయులు, అరికెర మల్లికార్జునను నిందితులుగా పేర్కొంటూ వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు చిప్పగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన టిప్పరు డ్రైవర్‌ను చిప్పగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టిప్పర్ యజమాని, డ్రైవర్‌ను విచారించడం ద్వారా కేసును రెండు, మూడు రోజుల్లోనే పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. చిప్పగిరి లక్ష్మినారాయణ గుంతకల్లులో చేసిన పంచాయితీలపై కూడా కొందరిని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలున్నట్టు తెలిసింది. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం లక్ష్మినారాయణ మృతదేహాన్ని ఉదయం 11 గంటల ప్రాంతంలో చిప్పగిరికి తరలించారు.
చిప్పగిరిలో లక్ష్మినారాయణ అంత్యక్రియలు
ఆలూరు/చిప్పగిరి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గ కాంగెస్ పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మినారాయణను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ, ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. దారుణ హత్యకు గురైన లక్ష్మినారాయణ అంత్యక్రియలు సోమవారం చిప్పగిరిలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు వేలాదిగా తరలివచ్చారు. మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్‌మాదిగ, నంద్యాల డీసీసీ అధ్యక్షులు జెంగిటి లక్ష్మినారాయణ తదితరులు చిప్పగిరి లక్ష్మినారాయణ పార్థివదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుల వైఫల్యంతోనే లక్ష్మినారాయణ హత్య జరిగిందన్నారు. తనపై హత్యకు కొందరు కుట్ర చేస్తున్నారంటూ పలుమార్లు డీఎస్పీతో పాటు ఎస్పీ ఎదుట లక్ష్మినారాయణ మొరపెట్టుకున్నా పోలీసులు రక్షణ కల్పించలేదన్నారు. తక్షణమే పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్యను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్మీనారాయణ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలన్నారు. దళితుల సంక్షేమానికి లక్ష్మినారాయణ పోరాటాలు చేశారన్నారు. నివాళులర్పించిన వారిలో మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దాదాగాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, ప్రభాకర్, బోయ క్రాంతినాయుడు, రమేష్‌యాదవ్, మురళీకృష్ణంరాజు, బజారన్న, మహేంద్రనాయుడు, నాగరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు తిరుపాల్, సుభాష్, గాదిలింగ, రామాంజనేయులు తదితరులు ఉన్నారు.
ఫోనలో పరామర్శించిన వైఎస్ షర్మిల
హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చిప్పగిరి లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఫోనలో పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలన్నారు. హత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని కర్నూలు ఎస్పీని కోరినట్లు తెలిపారు.
లోపించిన శాంతిభద్రతలు
నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మినరసింహయాదవ్
కల్లూరు, ఏప్రిల్ 28 :(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దళిత బహుజన, గిరిజన, మైనార్టీలపై రోజురోజుకూ హత్యలు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయన్నారు. ఈ అంశాన్ని జాతీయ ఎస్సీ కమిషన దృష్టికి తీసుకెళతామన్నారు. పోలీసుల వైఫల్యంతోనే హత్య జరిగిందని తక్షణమే పత్తికొండ డీఎస్పీని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇనచార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ మృతికి కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని నంద్యాల డీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు జెంగిటి లక్ష్మీనరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దాదాగాంధీతో కలిసి చిప్పగిరిలో లక్ష్మీనారాయణ అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.