Education Department: 15లోగా మెగా డీఎస్సీ ఫలితాలు
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:30 AM
మెగా డీఎస్సీ-2025 ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన.. నెలాఖరుకు పోస్టింగ్
16,347 మంది టీచర్లకు వారాంతాల్లో శిక్షణకు ప్రణాళిక
అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025 ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించనుంది. క్రీడల కోటాలో ఉన్న 421 పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా శాప్ నుంచి అందలేదు. అవి రాగానే జిల్లాల్లో కటాఫ్ మార్కులు ప్రకటిస్తుంది. ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తిచేస్తారు. నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. కాగా, కొత్తగా వచ్చే 16,347 మంది ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగ్‌లకు ముందే పూర్తిచేస్తారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడటంతో నాలుగైదు శని, ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా సెప్టెంబరు మొదటి వారం నుంచే కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరనున్నారు.