Share News

పంట ఉత్పత్తులతో మార్కెట్‌ కళకళ

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:48 PM

నాలుగైదు నెలలుగా వెలవెలబోయిన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆదివారం పంట ఉత్పత్తులతో కళకళలాడింది.

   పంట ఉత్పత్తులతో మార్కెట్‌ కళకళ
మార్కెట్‌కు వచ్చిన వేరుశనగను రాశులు పోసిన దృశ్యం

ఎమ్మిగనూరుకు వచ్చిన 18,063 బస్తాల వేరుశనగ దిగుబడి

గరిష్ఠ ధర రూ.6,933

రెండు వారాలతో పోలిస్తే రూ.100 తగ్గిన రేటు

ఎమ్మిగనూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): నాలుగైదు నెలలుగా వెలవెలబోయిన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆదివారం పంట ఉత్పత్తులతో కళకళలాడింది. ఎమ్మిగనూరు చుట్టు ప్రాంతాల నుంచే కాకుండా గోనెగండ్ల, సి.బెళగల్‌, క్రిష్ణగిరి, దేవనకొండ, పెద్దకడుబూరు మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వేరుశనగ పంట ఉత్పత్తులను తీసుకొచ్చారు. దీంతో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణ రైతులు, వ్యాపారులు, హామాలీలతో కళకళలాడింది. వేరుశనగ 18,063 బస్తాలు(5419 క్వింటాళ్లు) అమ్మకానికి వచ్చాయి. వేరుశనగ క్వింటం గరిష్ఠ ధర రూ. 6,933, మధ్యస్థం రూ. 6,170, కనిష్ఠం రూ.3,006 పలికింది. గత రెండు వారాలతో పోలిస్తే రూ.100 తగ్గింది. కాగా వేసవి కాలం సీజనలో భారీగా రావాల్సిన పంట ఉత్పత్తుతులు ఏమాత్రం రాకపోవటంతో మార్కెట్‌ కమిటీ నాలుగైదు నెలలుగా వెలవెల బోయింది. దీంతో వ్యాపారాలు లేక కమీషన ఏజెంట్లు, కొనుగోలు దారులు ఒకింత ఇబ్బందికి గురయ్యారు. ఇక మార్కెట్‌పై ఆధారపడే హమాలీలు, వేమెన్లు, ఎద్దుల బండ్ల నిర్వాహకులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే వారం రోజుల నుంచి మార్కెట్‌కు పంట ఉత్పత్తులు రావటం ప్రారంభం కావటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 11:48 PM