Share News

Vizianagaram: ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని ట్రాక్టర్‌తో గుద్దించి హత్య..

ABN , Publish Date - Apr 26 , 2025 | 09:24 PM

Vizianagaram News: సోదరికి ఆస్తిలో వాటా ఇవ్వటం రాజశేఖర్‌కు ఇష్టం లేకపోయింది. తనకు దక్కాల్సిన ఆస్తి సోదరికి వెళ్లటం తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. వారిని ఎలాగైనా చంపి పగ తీర్చుకోవాలని అనుకున్నాడు.

Vizianagaram: ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని ట్రాక్టర్‌తో గుద్దించి హత్య..
Vizianagaram News

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న కార్ల్‌మార్క్స్ మాటలు నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు బంధాల కంటే.. డబ్బులకే విలువ ఎక్కువ. సమాజంలో పది రూపాయల కోసం.. ఆఖరికి రూపాయి కోసం కూడా హత్యలు జరుగుతున్నాయి. ఆస్తుల కోసం రక్త సంబంధీకులే కొట్టుకుని చస్తున్నారు. ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఆఖరికి కన్న తల్లిదండ్రుల్ని కూడా వదలిపెట్టడం లేదు. తాజాగా, ఓ వ్యక్తి ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని హత్య చేశాడు. వారిని ట్రాక్టర్‌తో గుద్దించి చంపాడు. ఈ దారుణమైన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో చోటుచేసుకుంది.


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరకల్లాలు గ్రామానికి చెందిన 60 ఏళ్ల అప్పలనాయుడు, 58 ఏళ్ల జయమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు... కొడుకు రాజశేఖర్, ఓ కూతురు ఉన్నారు. అప్పలనాయుడు తన కూతురికి కూడా ఆస్తిలో వాటా ఇచ్చాడు. అయితే, సోదరికి ఆస్తిలో వాటా ఇవ్వటం రాజశేఖర్‌కు ఇష్టం లేకపోయింది. తనకు దక్కాల్సిన ఆస్తి సోదరికి వెళ్లటం తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. వారిని ఎలాగైనా చంపి పగ తీర్చుకోవాలని అనుకున్నాడు.


అప్పలనాయుడు, జయమ్మలను ట్రాక్టర్‌తో గుద్దించి చంపేశాడు. స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపిచారు. నిందితుడు రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆస్తి కోసం కన్న కొడుకు తల్లిదండ్రుల్ని చంపిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జనం రాజశేఖర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Viral Video: తల్లీ నీ ధైర్యానికి సెల్యూట్.. చెట్టు మీద ఆ డ్యాన్స్ అదుర్స్ కానీ..

Massive Explosion: అత్యంత భారీ పేలుడు.. కిలోమీటర్ వరకు ప్రభావం

Updated Date - Apr 26 , 2025 | 09:28 PM