Liquor Scam Exposed: గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు దోచుకున్న సొమ్ముతో దొరికేశారు
ABN , Publish Date - Aug 03 , 2025 | 03:23 AM
లిక్కర్ స్కామ్ దొంగలు నోట్ల కట్టల సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. మద్యం ముడుపులను... ఎన్నికల సమయంలో ఓట్ల కొనుగోలుకు ఉపయోగించారనే ఆరోపణలకు తిరుగులేని సాక్ష్యం లభించింది.

‘సిట్’ చేతికి చిక్కిన వీడియో
లెక్కబెడుతున్న చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్
ఎన్నికల ముందు వైసీపీ అభ్యర్థులకు పంపిణీ!
రాజ్ కసిరెడ్డి పంపే సొమ్ములు భద్రపరిచి చెవిరెడ్డి చెప్పిన వాళ్లకు అప్పగించిన వెంకటేశ్
లిక్కర్ కేసులో ఏ34.. చెవిరెడ్డితోపాటే అరెస్టు
ఇలాంటి వీడియోలు అనేకం రిట్రీవ్ చేసిన సిట్
అదో ‘డెన్’! అందులో... టేబుల్‌పై కట్టలు... కట్టలుగా నోట్లు! అట్టపెట్టెల్లో సర్దుతూ మరిన్ని నోట్ల కట్టలు! అక్కడున్న వారిపై అజమాయిషీ చేస్తూ... ఒక వ్యక్తి! ‘‘ఇప్పుడు ఇది 25 ఉంది. ఇది... ఫోర్ ఉంటుంది. ఇదీ ఉంది. సరిపోతుందిలే! మొత్తం 5 ఉంది’’... అంటూ లెక్కలు సరిచూస్తున్నాడు! ఆయన ఎవరో కాదు! వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు! మద్యం స్కామ్‌లో... ఏ34. వెంకటేశ్ నాయుడు ఫోన్ నుంచి ‘సిట్’ వెలికి తీసిన వీడియో... మొత్తం లిక్కర్ స్కామ్‌కు తిరుగులేని ఆధారంగా మారింది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
లిక్కర్ స్కామ్ ‘దొంగలు’ నోట్ల కట్టల సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. మద్యం ముడుపులను... ఎన్నికల సమయంలో ఓట్ల కొనుగోలుకు ఉపయోగించారనే ఆరోపణలకు తిరుగులేని సాక్ష్యం లభించింది. ఇంకెవరో కాదు... లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలను సర్దుతూ... లెక్కలు చెబుతున్న వీడియో బయటపడింది. ఈ కేసులో వెంకటేశ్ నాయుడు (ఏ34)ను సిట్ అధికారులు జూన్ 18వ తేదీన బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. వెంకటేశ్ నాయుడు ఫోన్‌ను స్వాధీనం చేసుకుని... అందులో వాట్సాప్ నుంచి తొలగించిన చాట్, వీడియోలను సాంకేతిక సహాయంతో రిట్రీవ్ చేశారు. అందులో... 35 సెకన్ల వీడియో ఒకటి ఇప్పుడు బయటపడింది. అందులో... వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలు చక్కగా లెక్కబెడుతున్నాడు. టేబుల్‌పైన ఉన్నవి... కింద అప్పటికే అట్టపెట్టెల్లో సర్దినవి... మొత్తం కలిసి ‘ఐదు’ (కోట్లు) ఉన్నట్లు ధ్రువీకరిస్తూ ఆ మొత్తాన్ని బట్వాడాకు సిద్ధం చేసిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డు అయ్యాయి.
ఎవరీ వెంకటేశ్ నాయుడు...
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేశ్ నాయుడు ముఖ్య అనుచరుడు. అనేక పర్యాయాలు జగన్‌ను కూడా కలిశాడు. మద్యం ముడుపుల సొమ్మును ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ఉపయోగించాలనేది వైసీపీ స్కీమ్! విశ్వసనీయ సమాచారం ప్రకారం... ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ అభ్యర్థులకు డబ్బులు బట్వాడా చేసే బాధ్యతను చెవిరెడ్డికి అప్పగించారు. వెంకటేశ్ నాయుడు ద్వారా డబ్బు పంపిణీ జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ‘క్రిష్ వ్యాలీ’లో ఏర్పాటు చేసుకున్న డెన్‌కు రాజ్ కసిరెడ్డి (ఏ1) నుంచి విడతల వారీగా రూ.25 లక్షల నుంచి 30 లక్షల దాకా బాక్సుల్లో వచ్చేవి. ఆ మొత్తాన్ని వెంకటేశ్ నాయుడు భద్రపరిచేవాడు. ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచి ఈ డబ్బును జిల్లాలకు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ‘ఫలానా నంబరు, ఫలానా కారులో ఒకరు వస్తారు. రూ.5 కోట్లు ఇచ్చి పంపించు’ అని చెవిరెడ్డి ఆదేశించేవారు. ఆ మేరకు... వెంకటేశ్ నాయుడు డబ్బులు రెడీ చేసి, బాక్సుల్లో పెట్టి అప్పగించేవాడు. ఇప్పుడు వీడియోలో బయటపడింది.. 2023 నవంబరు నాటి దృశ్యాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులో దొరికిన రూ.8 కోట్ల నగదు కూడా ఇతని ద్వారానే బట్వాడా అయినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు.
తామే వీడియోలు తీసి...
‘తమ ఆదేశాల మేరకు డబ్బులు పంపిణీ చేశారా... లేదా..’ అని నిర్ధారించుకునేందుకు వీడియోలు తీసి పంపాలనేది ‘లిక్కర్ పెద్దలు’ పెట్టిన రూల్! అందులో భాగంగా... వెంకటేశ్ నాయుడు కూడా డబ్బులు రెడీ చేసి అప్పగించేముందు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి, దానిని పైవాళ్లకు పంపించేవాడు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక నిందితులు ముందుజాగ్రత్తగా తమ సెల్‌ఫోన్ల నుంచి ఆ వీడియోలను డిలీట్ చేశారు. అయితే అధికారులు సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్)కి పంపి డిలీట్ చేసిన వీడియోలను వెలికి తీయించారు. దీనిపై గతనెల 14వ తేదీన ‘కట్టల గుట్టలు!’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు బయటపడిన వీడియో వాటిలో ఒకటే! ఇలాంటివి మరెన్నో ఉన్నట్లు సమాచారం!
హవాలా ‘లింకు’పై ఈడీ ఆరా
సొమ్ములు తరలించినట్లు గుర్తించిన ఈడీ
వెంకటేశ్ నాయుడు వీడియో పరిశీలన
మద్యం స్కామ్ నిందితులు హైదరాబాద్‌లోని టాప్ హవాలా డీలర్లలో ఒకరి ద్వారా భారీగా విదేశాలకు సొమ్ము తరలించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించినట్లు తెలిసింది. ఒక్క వెంకటేశ్ నాయుడే అతని ద్వారారూ.35 కోట్లు పంపినట్లు తమకు సమాచారం ఉందని, వారిద్దరినీ కలిపి ప్రశ్నించాల్సి ఉందని ‘సిట్’కు ఈడీ చెప్పినట్లు తెలిసింది. ఇందులో భాగంగా... తాజాగా నోట్లకట్టలతో బయటపడిన వెంకటేశ్ నాయుడు వీడియోను కూడా తమ పరిశీలనకు పంపాలని ‘సిట్’ను కోరినట్లు తెలిసింది.