AP Govt: ల్యాండ్ పూలింగ్ స్కీం-2025కు నోటిఫికేషన్
ABN , Publish Date - Jul 02 , 2025 | 06:50 AM
ఏపీ రాజధాని నగరం అమరావతి మినహా మిగిలిన రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ స్కీం-2025 రూల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాజధాని నగరం మినహా మిగిలిన ప్రాంతంలో అమలు
అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని నగరం అమరావతి మినహా మిగిలిన రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ స్కీం-2025 రూల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజా రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రాజెక్టులు ఎయిర్‌పోర్టులు, పోర్టులు, ఇతర వసతులు కల్పించేందుకు స్వచ్ఛంద భూసేకరణ యంత్రాంగం అవసరమని సీఆర్‌డీఏ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. భూ యజమానులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మధ్య పరస్పర సమన్వయంతో భూసమీకరణ పథకం చేపట్టాలని నిర్ణయించారు. రైతులు లేదా రైతుల బృందం నుంచి భూమిని సమీకరించి అభివృద్ధి చేసేందుకు నిబంధనలు నిర్దేశిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూసమీకరణ పథకం(సూత్రీకరణ, అమలు) రూల్స్, 2025ను రూపొందించారు. ఈ నిబంధనలు రాజధాని నగరం మినహా మిగిలిన రాజధాని ప్రాంతంలో ప్రాజెక్టులకు భూమి సమీకరించేందుకు వినియోగిస్తారు. ఆ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి నోటిఫికేషన్ జారీచేసింది.