Share News

Mangalagiri Court Bail: అసభ్య పదజాలం వాడొద్దు

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:35 AM

రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Mangalagiri Court Bail: అసభ్య పదజాలం వాడొద్దు

  • కేసు విషయాలు మాట్లాడరాదు

  • సాక్షులను ప్రభావితం చేయడం బెదిరించడం వంటివి చేయొద్దు

  • అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దు

  • కొమ్మినేనికి షరతులతో మంగళగిరి కోర్టు బెయిల్‌

గుంటూరు, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ప్రతి నెలా రెండు, నాలుగు శనివారాల్లో తుళ్లూరు ఎస్‌హెచ్‌ఓ ఎదుట హాజరై సంతకం చేయాలని, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించింది. కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడరాదని, అసభ్యకరమైన పదజాలం వాడరాదని సూచించింది. ఎదుటివారిని కించపరిచే వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేసింది. రూ.20 వేలు చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సోమవారం రాత్రి గుంటూరు జిల్లా జైలు నుంచి కొమ్మినేని విడుదలయ్యారు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, వైసీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు తదితరులు జిల్లా జైలు వద్దకు వచ్చారు. కొమ్మినేనికి వైసీపీ నాయకులు పూలమాలలు వేశారు. కోర్టు షరతుల నేపథ్యంలో తానేమి మాట్లాడలేనని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కొమ్మినేని ముగించారు. జైలు వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఈ నెల 6న సాక్షి చానల్‌లో యాంకర్‌ కొమ్మినేని లైవ్‌ డిబేట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎనలిస్టు కృష్ణంరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. ఏపీ రాజధానిని సీఎం చంద్రబాబు దేవతల రాజధానిగా కొనియాడుతున్నారని, కానీ అది దేవతల రాజధాని కాదని, వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించారు. రాజధాని చుట్టూ వేశ్యలు, ఎయిడ్స్‌ రోగులు ఎక్కువగా ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించకపోగా అవును తాను కూడా ఇంగ్లిష్‌ పత్రికలో చూశానంటూ ప్రోత్సహించేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8న తుళ్లూరు పోలీస్‌ ేస్టషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేశారు. 10న మంగళగిరి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించారు. అప్పటి నుంచి కొమ్మినేని గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. కొమ్మినేని తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, కోర్టు విచారణలో ఉన్న సమయంలో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 13న షరతులకు లోబడి బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం మంగళగిరిలోని అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కొమ్మినేనికి షరతులతో కూడిన బెయిల్‌ను మేజిరేస్టట్‌ ఎం ప్రసన్నలక్ష్మి మంజూరు చేశారు.

Updated Date - Jun 17 , 2025 | 05:36 AM