Vijayawada: ఇరిగేషన్ జేఈఈ కిశోర్ నిర్బంధం
ABN , Publish Date - Jul 12 , 2025 | 06:47 AM
పోలవరం కాలువ గట్టు మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఇరిగేషన్ అధికారి ఒకరిని అక్రమార్కులు గురువారం అర్ధరాత్రి నిర్బంధించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ...

గేటుకు తాళం వేసి పరారైన కాపలాదారుడు
విజయవాడ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పోలవరం కాలువ గట్టు మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఇరిగేషన్ అధికారి ఒకరిని అక్రమార్కులు గురువారం అర్ధరాత్రి నిర్బంధించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా పోలవరం కాలువ కట్ట వెంబడి కొందరు మట్టి తవ్వకాలను తవ్వుతున్నారు. దీనిపై కొత్తూరు తాడేపల్లి గ్రామస్థులు పోలవరం ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అర్ధరాత్రి 12.14 గంటలకు డీఈ అప్పిరెడ్డి, జేఈఈలు కిశోర్, కౌషిక్.. ఆ ప్రాంతానికి వెళ్లగా అక్రమార్కులు పారిపోయారు. జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఈ మట్టిని పక్కనే ఉన్న మామిడితోటలో పోస్తున్నారన్న సమాచారంతో జేఈఈ కిశోర్ ఆ తోటలోకి వెళ్లగా, ఆ తోట కాపలాదారుడు గేటుకు తాళం వేసి పారిపోయాడు. బయటికి వచ్చే మార్గం లేకపోవడంతో ఆయన డీఈకి ఫోన్ చేశారు. డీఈ.. గ్రామస్థులకు కబురుపెట్టగా వారు వచ్చి తోట గేటుకు ఉన్న తాళం పగులగొట్టి కిశోర్‌ను బయటికి తీసుకొచ్చారు. కాగా, విజయవాడ రూరల్ మండలం పరిధిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం కాలువ మట్టి కట్టల వెంబడి లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు. కూటమి అధికారంలోకి వచ్చిన క్రమంలో ఈ తవ్వకాలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. విజిలెన్స్ నివేదిక ఇవ్వాల్సిన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.