CM Chandrababu: నువ్వు లేపేస్తా అంటే.. ఇక్కడ ఉన్నది సీబీఎన్
ABN , Publish Date - Aug 03 , 2025 | 03:54 AM
49 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నా.. నా అనుభవంలో ప్రస్తుతం ఉన్నంత దారుణ పరిస్థితి ఎన్నడూ చూడలేదు. రాజకీయమంటే మనల్ని చూసి పది మంది నేర్చుకోవాలి.

రప్పా, రప్పా ఏమిటో ప్రజలు ఆలోచించాలి
నా 49 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి నాయకుడినీ, పార్టీనీ చూడలేదు
జగన్, ఆ పార్టీ నేతలపై చంద్రబాబు ఫైర్
ఇంటర్నెట్ డెస్క్ ‘49 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నా.. నా అనుభవంలో ప్రస్తుతం ఉన్నంత దారుణ పరిస్థితి ఎన్నడూ చూడలేదు. రాజకీయమంటే మనల్ని చూసి పది మంది నేర్చుకోవాలి. అంతిమ లక్ష్యం అధికారమే అయినా నిబద్ధత, నైతిక విలువలు, కట్టుబాట్లు ఉం డాలి. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఒకాయన వ్యవహారం ఎలా ఉందో చూడండి.. ఆయనను చూసి ఏమి నేర్చుకోవాలి? గొడ్డలి వేటా? బూతుల పంచాంగమా? రప్పా, రప్పా ఏమిటో ప్రజలు ఆలోచించాలి. మా వాళ్లను మీ ఇళ్లకు పంపితే లేపేస్తారని నెల్లూరులో అతను మాట్లాడాడు. నువ్వు లేపేస్తా అంటే.. చూడటానికి ఇక్కడ ఉంది సీబీఎన్’ అంటూ వైసీపీ అఽధినేత జగన్‌ను పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. గతంలో తీవ్రవాదులు, ఫ్యాక్షనిస్టులు, సంఘ విద్రోహశక్తులతో పోరాడామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ ముసుగులో కొందరు వస్తున్నారని, వారి రాజకీయ ముసుగు తొలగించి నేరస్తులుగానే పరిగణించాలని అన్నారు. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం.. కష్టాలు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా 2047 నాటికి దేశంలో ఏపీ ప్రథమస్థానంలో ఉండాలన్న సంకల్పంతో రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, ప్రజలంతా తనకు సహకరించాలని కోరారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ తీరు దారుణంగా ఉందన్నారు. ఆ పార్టీ అధినేత వైఖరిని వివరిస్తూ అలాంటి పార్టీని, అలాంటి నాయకుడిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ‘‘అమరావతి మహిళలను బ్రోతల్స్‌గా చిత్రీకరించేలా మాట్లాడిన దానిపై ప్రకాశం జిల్లాలోనే పొదిలిలో క్షమాపణ చెప్పాలని స్థానిక మహిళలు కోరితే వారిపై దాడులు చేశారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వ్యక్తిగత జీవితంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంత్యంత దారుణంగా మాట్లాడారు. అదే నేనైతే అలాంటి వ్యక్తిని పిలిచి వార్నింగ్ ఇచ్చి ఇంకొకరు అలా మాట్లాడకుండా చేసేవాడిని. కానీ ఆ పార్టీ అధినేత వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించడాన్ని ప్రజలు గమనించాలి. బంగారుపాళెం వీడియోలను నెల్లూరులో జరిగినట్లు ఫేక్ ప్రచారం చేశారు. గతంలో నేను ఒకసారి ఏమరుపాటుగా ఉంటే బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసి మరుటిరోజు సాక్షిలో నారాసుర రక్తచరిత్ర అని రాశారు. ప్రజలంతా ఇలాంటివి గమనించాలి’’ అని చంద్రబాబు అన్నారు.