Share News

High Court: ఏఎస్పీకి దర్యాప్తు అప్పగించడం సరికాదు

ABN , Publish Date - Jul 12 , 2025 | 06:57 AM

టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో కేసును దర్యాప్తు చేయాలంటూ అదనపు ఎస్పీ వెంకట్రావును సీబీఐ డైరెక్టర్‌ ఆదేశించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

High Court: ఏఎస్పీకి దర్యాప్తు అప్పగించడం సరికాదు

  • సుప్రీం కోర్టు వేసిన సిట్‌తోనే నకిలీ నెయ్యిపై దర్యాప్తు చేయాలి: హైకోర్టు

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో కేసును దర్యాప్తు చేయాలంటూ అదనపు ఎస్పీ వెంకట్రావును సీబీఐ డైరెక్టర్‌ ఆదేశించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఏఎస్పీకి దర్యాప్తును అప్పగిస్తూ గతేడాది అక్టోబరు 28న సీబీఐ డైరెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అధిగమించడమేనంది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ తీర్పు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడుకాని ఏఎస్పీ వెంకట్రావు విచారణకు హాజరుకావాలంటూ తనకు నోటీసు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అప్పటి పీఏ అప్పన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తీర్పు ప్రతి శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఐపీఎస్‌ అధికారులు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపినాథ్‌ జెట్టిలను సిట్‌లో సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిందని, వీరికి అదనంగా అడిషనల్‌ ఎస్పీ వెంకట్రావును దర్యాప్తు అధికారిగా చేర్చడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్‌ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇక, టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి. దీంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. సిట్‌ తరఫున సీబీఐ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సురే్‌షకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. తనకు అర్హతలేదని తెలిసి కూడా నెయ్యి సరఫరాకు టెండర్‌ వేశారని, పిటిషనర్‌కు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 08:52 AM