మందుల కొరత లేకుండా చూడాలి: సత్యకుమార్
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:15 AM
ప్రభుత్వాస్పత్రుల్లో నిత్యావసర మందులకు కొరత లేకుండా చూడాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సృష్టం చేశారు.

అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రుల్లో నిత్యావసర మందులకు కొరత లేకుండా చూడాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సృష్టం చేశారు. మంగళవారం ఏపీఎంఎస్‌సఐడీసీ కార్యాలయానికి వెళ్లిన ఆయన, అధికారులతో చర్చించారు. మందుల కొనుగోలు, వివిధ ప్రభుత్వాస్పత్రులకు వాటి సరఫరాపై సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కారణాల వల్ల 150కి పైగా మందుల లభ్యతలో కొరత ఉండేదని, తాజాగా తొమ్మిది రకాల మందుల కొరత మాత్రమే ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో 712 రకాల మందుల అవసరాన్ని గుర్తించగా.. ఏపీఎంఎస్‌సఐడీసీ 650 రకాల మందులు కొనుగోలు చేస్తోందని, తక్కువ మోతాదులో అవసరమయ్యే 56 రకాలను ఆస్పత్రుల స్థాయిల్లో సమీకరించుకుంటున్నారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆస్పత్రుల అవసరాలకు అనుగుణంగా మందులు కోనుగోలు చేయాలని సూచించారు. ఏపీఎంఎస్‌సఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఎండీ గిరీశ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తొలి ఏడాది మెరుగైన సేవలు: మంత్రి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే దిశగా అడుగులు వేసిందని సత్యకుమార్ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలో ఆరోగ్యశాఖ చేపట్టిన కార్యక్రమాలు, ప్రయత్నాలు, ఫలితాలకు సంబంధించిన వివరాలను ఆయన ఐదు పేజీల నివేదిక ద్వారా సీఎం చంద్రబాబుకు అందించారు. ప్రభుత్వ వైద్య రంగంలో భాగస్వాములైన అందరూ జవాబుదారీతనం, క్రమశిక్షణలతో వ్యవహరించి.. మెరుగైన వైద్య సేవలందించేందుకు ఏడాది కాలంగా కృషి చేసినట్లు తెలిపారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.