Share News

Vijayawada: గుడివాడ ఘటనంతా.. పేర్ని నాని మైండ్‌ గేమే

ABN , Publish Date - Jul 14 , 2025 | 02:46 AM

గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వెను మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని హస్తం బట్టబయలైంది. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు, గొడవలు సృష్టించడానికి ముందస్తు ప్రణాళికతోనే...

Vijayawada: గుడివాడ ఘటనంతా.. పేర్ని నాని మైండ్‌ గేమే

  • గుడివాడ హైడ్రామా వెనుక పక్కా వ్యూహం

  • మాజీ మంత్రి పథక రచనతోనే జడ్పీ చైర్‌పర్సన్‌, ఆమె భర్త గుడివాడ రాక

  • ఉద్దేశపూర్వకంగానే కారాపి హైడ్రామా

  • పోలీసులు చెప్పినా వెళ్లకుండా..టీడీపీ శ్రేణులపై అసభ్య దూషణలు

  • ఎస్‌ఐ వచ్చి బతిమాలినా కదలని వైనం

  • దాడి తర్వాత స్టేషన్‌కెళ్లి హారిక కన్నీరు

  • బీసీ మహిళా జడ్పీ చైర్‌పర్సన్‌పై లోకేశ్‌ దాడి చేయించారంటూ పేర్ని హడావుడి

  • ఆందోళనలకు జగన్‌ పిలుపివ్వాలంటూ వైసీపీ పెద్దలతో ఫోన్‌ సంభాషణ

  • వెలుగులోకి వచ్చిన వీడియో

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వెను మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని హస్తం బట్టబయలైంది. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు, గొడవలు సృష్టించడానికి ముందస్తు ప్రణాళికతోనే బీసీ మహిళ అయిన కృష్ణా జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రామును ఆయన అక్కడకు పంపినట్లు తెలుస్తోంది. ‘రప్పా రప్పా అని నరుకుతామంటూ అరవడం కాదురా.. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. మీకు చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక.. ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్లను నరికెయ్యండి! చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికెయ్యాలి. ఆ తర్వాత ఎలా జరిగిందంటూ మీరంతా వెళ్లి పలకరించాలి. అయినా చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు చెప్పడమేంటి అసహ్యంగా’ అంటూ గత గురు, శుక్రవారాల్లో కృష్ణా జిల్లా పామర్రు, అవనిగడ్డ వైసీపీ కార్యకర్తలను పేర్ని నాని రెచ్చగొట్టేలా మాట్లాడడంతో.. వైసీపీ శ్రేణులను ఉన్మాదుల మాదిరిగా రెచ్చగొడుతున్న మాజీ మంత్రి గుడివాడ వస్తే దేహశుద్ధి చేస్తామని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారు. ఆయన అక్కడకు వస్తారన్న సమాచారంతో శనివారం మధ్యాహ్నం నుంచే ఎదురుచూశారు. అయితే గుడివాడలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మచిలీపట్నంలో పేర్ని నానిని ఇంటి నుంచి బయటకు కదలనివ్వలేదు. దీంతో ఆయన మైండ్‌గేమ్‌కు తెరలేపారు.


టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి.. వారు దాడిచేస్తే.. ప్రజల నుంచి సానుభూతి పొందాలని ఎత్తువేశారు. ఆయన పథకం ప్రకారం జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాము సాయంత్రం ఒకే కారులో కలిసి వచ్చారు. దానిని పేర్ని నాని వాహనంగా భావించిన టీడీపీ కార్యకర్తలు కారు వద్ద గుమిగూడారు. అయితే అందులో హారిక, రాము ఉండడంతో వారినేమీ అనలేదు. వాళ్లు వెళ్లిపోవడానికి దారి కూడా ఇచ్చారు. ఈ లోపు పోలీసులు సైతం వచ్చారు. కానీ రాము కారు అద్దం దించి వారితో ఆవేశంగా మాట్లాడారు. టీడీపీ శ్రేణులను లం.కొ.లు అంటూ.. బూతులు తిడుతూ ఓవరాక్షన్‌ చేశారు. అయినా పోలీసులు సంయమనంతో కారు పోనివ్వాలని సూచించారు. కానీ కారు ఆపేయాలని రాము ఆదేశించారు.స్థానిక ఎస్‌ఐ వచ్చి ముందుకు వెళ్లిపోవాలని అభ్యర్థించినా వినిపించుకోలేదు. ఈ దశలో టీడీపీ శ్రేణులు కూడా ప్రతిఘటనకు దిగాయి. కారు వెనుక అద్దంపై రాయి విసరడంతో అది పగిలింది. తాము అనుకున్నట్లే జరగడంతో రాము, హారిక రోడ్డు మధ్యలో కారు ఆపారు. చేయాల్సిన గొడవంతా చేశాకే ముందుకెళ్లారు. వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వ్యతిరేక దిశలో కారును తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాక.. హారికను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. ఇది కూడా పేర్ని నాని డైరెక్షన్‌తోనే చేసినట్లు సమాచారం. స్టేషన్‌లో హారిక కారణం లేకుండానే ఏడుస్తూ హైడ్రామా చేశారు.


వైసీపీ పెద్దలకు ఫోను..

ఇంకోవైపు.. ఈ ఘటనను రాష్ట్రవ్యాప్త అంశంగా మార్చేందుకు పేర్ని నాని ప్రయత్నించారు. వైసీపీ పెద్దలతో ఫోన్‌లో మాట్లాడుతూ.. బీసీ మహిళపై దాడిచేయాలని లోకేశ్‌ ఆదేశిస్తేనే.. గుడివాడ టీడీపీ శ్రేణులు చేశాయని, బీసీ మహిళపై జరిగిన దాడి ని ఖండిస్తూ పార్టీ తరఫున పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సిందిగా అధినేత (జగన్‌ ) చెప్పాలని సూచించారు. ఈ వీడియో బయటకు రావడంతో పేర్ని నాని కుట్ర బయట పడింది. గుడివాడ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు ఆదివారం వెలుగుచూశాయి. అవి వైరల్‌గా మారాయి. పేర్ని నాని ఫోన్‌ కాల్‌ దరిమిలా ఆదివారం వైసీపీ శ్రేణుల ఆందోళనలతో ఈ ఉదంతం వెనుక ఆయనే ఉన్నట్లు వెల్లడైందని.. బీసీ కులాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి టీడీపీ కూటమికి దూరం చేసేందుకు కుట్ర పన్నారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.


బీసీ మహిళను అడ్డం పెట్టుకొని: కొల్లు

బీసీ మహిళను అడ్డం పెట్టుకొని, కుట్రలు, కుతంత్రాలతో అరాచకం సృష్టించాలని వైసీపీ నాయకులు ప్రయత్నించడం వారి నీచ రాజకీయానికి పరాకాష్ఠ అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్‌ కారును పోలీసులు వదిలేసినా.. ఆమె కావాలని వచ్చి పోలీసుల్ని, టీడీపీ నాయకుల్ని దుర్భాషలాడారని, ఆ సమయంలో టీడీపీ నాయకులు తిరగబడితే దాన్ని టీడీపీ నాయకత్వానికి అంటగట్టాలని పేర్ని నాని ప్రయత్నించారని అన్నారు. జగన్‌ డైరెక్షన్‌లో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాక్షస మూకలకు రాక్షస ఆలోచనలే వస్తాయని పేర్ని నాని మరోసారి నిరూపించారని అన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 05:25 AM