Godavari River Levels: శబరి, సీలేరు వరదతో ఎరుపెక్కిన గోదావరి
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:29 AM
గోదావరి నీరు ఎరుపెక్కింది. ఉపనదులైన శబరి, సీలేరు వరద నదిలో కలుస్తుండడంతో ఉధృతి పెరగడంతో పాటు రంగు మార్చుకుంటోంది. ఎగువన మహారాష్ట్రలో మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప నదులు పొంగి గోదావరిలో కలుస్తున్నాయి.

ఎగువన భారీ వర్షాలు.. 4 రోజుల్లో తీవ్ర ఉధృతికి అవకాశం
పోలవరం స్పిల్‌వేలోకి 1,95,294 క్యూసెక్కులు
ఆ మొత్తం దిగువకు విడుదల.. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి
1,85,143 క్యూసెక్కులు.. సాగు అవసరాలకు డెల్టాకూ నీరు
పోలవరం/ధవళేశ్వరం, జూలై 7(ఆంధ్రజ్యోతి): గోదావరి నీరు ఎరుపెక్కింది. ఉపనదులైన శబరి, సీలేరు వరద నదిలో కలుస్తుండడంతో ఉధృతి పెరగడంతో పాటు రంగు మార్చుకుంటోంది. ఎగువన మహారాష్ట్రలో మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప నదులు పొంగి గోదావరిలో కలుస్తున్నాయి. ఈ ప్రభావంతో రానున్న 3-4రోజుల్లో వరద మరింత పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర జలసంఘం, జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలోకి చేరుకున్న 1,95,294 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే ఎగువన 27.99 మీటర్లు, దిగువన 18.45 మీటర్లు.. కాఫర్ డ్యాంకు ఎగువన 28.15 మీటర్లు, దిగువన 17.45 మీటర్లు, కాఫర్ డ్యాంల మధ్య 16.04 మీటర్ల నీటిమట్టం నమోదైంది. స్పిల్‌వే గుండా వస్తున్న వరదనీటిని ఎప్పటికప్పుడు 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇంకోవైపు.. భద్రాచలం వద్ద నీటి మట్టం 18.20 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీకి 2,05,155 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఎగువ నుంచి 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావచ్చన్న అంచనాతో బేసిన్‌ను ఖాళీ చేయాలని నిర్ణయించారు. దిగువన కాటన్ బ్యారేజీ నుంచి 172 గేట్లను కొద్దిగా ఎత్తి 1,85,143 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. వ్యవసాయ అవసరాల కోసం తూర్పు డెల్టాకు 4,200, మధ్య డెల్టాకు 2,450 , పశ్చిమ డెల్టాకు 6,000 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తున్నారు.