Share News

Jammalamadugu: బైక్‌పై తీసుకెళ్లాడు.. ఒంటరిగా తిరిగొచ్చాడు

ABN , Publish Date - Jul 16 , 2025 | 06:49 AM

పర్యాటక కేంద్రంగా ఎంతో ప్రత్యేకత ఉన్న గండికోటలో ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. ఓ యువకుడు బైక్‌పై ఆమెను తీసుకెళ్లి, వచ్చేటప్పుడు ఒక్కడే రావడంతో అతడే చంపేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Jammalamadugu: బైక్‌పై తీసుకెళ్లాడు.. ఒంటరిగా తిరిగొచ్చాడు

  • గండికోటలో బాలిక దారుణ హత్య

  • ముళ్లపొదల్లో ఇంటర్‌ విద్యార్థిని మృతదేహం

  • పోలీసుల అదుపులో అనుమానితుడు లోకేశ్‌?

జమ్మలమడుగు, జూలై 15(ఆంధ్రజ్యోతి): పర్యాటక కేంద్రంగా ఎంతో ప్రత్యేకత ఉన్న గండికోటలో ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. ఓ యువకుడు బైక్‌పై ఆమెను తీసుకెళ్లి, వచ్చేటప్పుడు ఒక్కడే రావడంతో అతడే చంపేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి జమ్మలమడుగు పోలీసులు, బాధితుల కథనం ఇలా ఉంది. ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తికి చెందిన పసుపులేటి కొండయ్య, దస్తగిరమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. వీరు పిల్లల చదువులకోసం ప్రొద్దుటూరు గాంధీరోడ్డులోని సార్వకట్ట వీఽధిలో ఉంటున్నారు. వీరి కుమార్తె పసుపులేటి వైష్ణవి (17) ప్రొద్దుటూరులో ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుటోంది. సోమవారం ఉదయం కాలేజీకని ఇంటి నుంచి బయలుదేరింది. బాలిక కాలేజీకి రాలేదని అధ్యాపకులు వైష్ణవి తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. వెంటనే వారు కాలేజీకి వెళ్లి వైష్ణవి స్నేహితులను ఆరా తీశారు. గట్టిగా ప్రశ్నించగా.. గండికోటకు వెళ్లిందని కొందరు, కడపకు వెళ్లిందని కొందరు చెప్పారు. కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరులో సాయంత్రం వరకు వెతికి.. ఆచూకీ తెలియకపోవడంతో ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గండికోటలోని రంగనాథస్వామి ఆలయం వెనుక భాగంలోని ముళ్లపొదల్లో బాలిక మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, బాధితులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఆ మృతదేహం వైష్ణవిదిగా గుర్తించి, జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టి కొన్ని ఆధారాలు సేకరించింది.


వెంటపడిన వాడే చంపేశాడా?

గతంలో యర్రగుంట్ల మండలం హనుమనగుత్తికి చెందిన లోకేశ్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో వైష్ణవి వెంటపడేవాడు. అతడిని బాలిక కుటుంబ సభ్యులు మందలించారని తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం వీరిద్దరూ కలసి ప్రొద్దుటూరు నుంచి ద్విచక్రవాహనంలో గండికోటకు వెళ్లారు. వీరిద్దరూ గండికోటలో గేటు వసూళ్లు చేసేచోట ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్నారని గుర్తించారు. తిరిగి ఉదయం 10.47 గంటలకు లోకేశ్‌ ఒక్కడే ద్విచక్ర వాహనంపై గండికోట నుంచి బయటకు వచ్చినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది. దీన్నిబట్టి లోకేశే వైష్ణవిని హత్య చేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గండికోట హరిత హోటల్‌ వద్ద ఎస్పీ అశోక్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ ఏం జరిగిందో తెలీదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే పోలీసులు లోకేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిసింది. ఇతడు హనుమనగుత్తిలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, జులాయిగా తిరుగుతుంటాడని సమాచారం.

Updated Date - Jul 16 , 2025 | 06:51 AM