G Eswaraiah: ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా జి. ఈశ్వరయ్య
ABN , Publish Date - Oct 21 , 2025 | 04:52 PM
ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా జి.ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ స్థానంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య వ్యవహరిస్తారు. AISF, AIYF, రైతు సంఘం నాయకుడిగా పనిచేసిన ఈశ్వరయ్య
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)లో ముఖ్యమైన మార్పు జరిగింది. ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ స్థానం లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఇక ఈశ్వరయ్య వ్యవహరిస్తారు. గత 11 సంవత్సరాలుగా ఈ పదవిని నిర్వహిస్తున్న కె. రామకృష్ణ స్థానంలో ఈశ్వరయ్య బాధ్యతలు చేపట్టనున్నారు. AISF, AIYF, రైతు సంఘం నాయకుడిగా పనిచేసిన ఈశ్వరయ్య.. పలు ప్రజా సమస్యలపై పోరాడి ఇప్పుడు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి వచ్చారు.
ఇలా ఉండగా, విజయవాడలో నేడు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఆధ్వర్యంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాజా మీడియాతో మాట్లాడారు. 'నేడు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడలో నిర్వహించాం. నూతన రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. రామకృష్ణ దశాబ్దం పాటు కార్యదర్శిగా సేవలు అందించారు. ఎ.ఐ.వై.ఎఫ్ విద్యార్థి విభాగం నుంచి ఈశ్వరయ్య పని చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య ఎన్నో పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. రామకృష్ణ, ఈశ్వరయ్యకు నా అభినందనలు. ప్రజల కోసం, ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది.' అని రాజా తెలిపారు.
కడప జిల్లాకి చెందిన ఈశ్వరయ్య విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF), ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) రైతు సంఘం వంటి సంస్థల్లో కీలక పాత్రలు పోషించారు. ఏపీ విభజన తర్వాత సీపీఐ పార్టీలో ఈశ్వరయ్య అనేక ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. ముప్పల నాగేశ్వరరావు వంటి పోటీదారులు మద్దతు తెలపడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ఎన్నిక ఏపీ సీపీఐలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా ఈశ్వరయ్యకు సీపీఐ నేతలు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నానమ్మ వైద్యానికి సాయం కోరిన యువకుడికి ఊహించని షాక్..
జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ ముఖ్య విషయాలపై శ్రద్ధ వహించండి..