Gorantla Madhav in Jail: రాజమండ్రి జైలుకు గోరంట్ల మాధవ్
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:00 AM
గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు ఆరుగురితో పాటు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
మాజీ ఎంపీ సహా ఆరుగురు రాజమహేంద్రికి తరలింపు
గుంటూరు, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి) : పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడిచేసి, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై జులుం ప్రదర్శించిన కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం మాధవ్ సహా ఆరుగురు నిందితులను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తుండగా మాధవ్ అటకాయించి దాడి చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద హల్‌చల్ సృష్టించారు. ఈ కేసులో మాధవ్ సహా ఆరుగురిపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో సత్యసాయి జిల్లా రామగిరి మండలం శేషంపల్లికి చెందిన చిగండి రమేశ్ (29), అనంతపురం జిల్లా గార్ల దిన్నె మండలం కృష్ణాపురానికి చెందిన తాళ్ల దామోదర్ (29), సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఆర్ కొట్టాల గ్రామానికి చెందిన దిగివింటి శివ ప్రసాద్ (32), సత్యసాయి జిల్లా రామగిరి మండలం శేషంపల్లికి చెందిన చిదగొండ్ల శివయ్య (27), సత్యసాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లికి చెందిన గౌళ్ల సురేందర్ (23) ఉన్నారు.
మాధవ్ సహా ఆరుగురినీ గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టగా, మేజిస్ట్రేట్ జి.స్రవంతి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే, పోలీసుల వినతిపై భద్రతాకారణాల రీత్యా చివరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపాలని ఆదేశాలు జారీచేశారు. అంతకుముందు ఎస్పీ సతీశ్‌కుమార్ కేసు వివరాలను మీడియాకు వివరించారు. ‘‘ఒక యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే నిందితుడిని గురువారం ఇబ్రహీంపట్నంలో అరెస్టు చేశాం. అక్కడనుంచి గుంటూరుకు తరలిస్తుండగా తన అనుచరులతో పోలీస్ వాహనాన్ని అనుసరిస్తూ, వారి కస్టడీలో ఉన్న నిందితుడిపై మాధవ్ దాడి చేశారు. పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించారు. మాజీ ఎంపీయేకాకుండా మాజీ పోలీసు అధికారికూడా అయిన వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేం. రెచ్చగొట్టే వ్యాఖ్య లతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడ మే నిందితుల లక్ష్యం.’’ అని ఎస్పీ తెలిపారు.