Share News

Gorantla Madhav vs Police: మాధవ్‌ వీరంగం

ABN , Publish Date - Apr 12 , 2025 | 03:53 AM

గోరంట్ల మాధవ్‌ మరోసారి పోలీసులపై ఆగ్రహంతో రెచ్చిపోయారు ఎస్పీ కార్యాలయం, కోర్టు ప్రాంగణాల్లో హడావుడి చేయడంతో రిమాండ్‌

Gorantla Madhav vs Police: మాధవ్‌ వీరంగం

  • ఏం తమాషా చేస్తున్నారా?

  • ఎంపీగా చేశా.. పోలీస్‌ అధికారిని

  • మీడియా ఎదుట హాజరు వ్యవహారంలో

  • రెచ్చిపోయిన మాజీ ఎంపీ

  • ఎస్పీ కార్యాలయం వద్ద చిందులు

  • గుంటూరు కోర్టు వద్ద ఏఎస్పీపై రంకెలు

గుంటూరు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వరుసగా రెండోరోజూ పోలీసులపై చిందులు తొక్కారు. ‘తమాషా చేస్తున్నారా’ అంటూ రెచ్చిపోయారు. జగన్‌ సతీమణి భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయి, పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చేబ్రోలు కిరణ్‌పై దాడి చేసేందుకు మాధవ్‌ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనతోపాటు దాడిలో పాల్గొన్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టినట్లే మాధవ్‌ తదితరులనూ ప్రవేశపెట్టాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల మాధవ్‌ను మినహాయించి, మిగిలిన ఐదుగురిని మాత్రమే మీడియా ఎదుట హాజరుపరిచారు. అయితే, అప్పటికే పోలీసులపై గోరంట్ల మాధవ్‌ వీరంగం చేశారు. ‘‘ఏం తమాషాలు చేస్తున్నారా? దోపిడీ దొంగనా నేను? దేశానికి ఎంపీగా చేశా.. పోలీస్‌ ఆఫీసర్‌ని.... ఏమనుకుంటున్నారు...?’’ అంటూ రెచ్చిపోయారు. అసలు ఏమనుకుంటున్నారంటూ పోలీస్‌ అధికారులపై హెచ్చరిక స్వరం వినిపించారు. అనంతరం మాధవ్‌ సహా నిందితులందరినీ పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. మాధవ్‌ తీరును గుంటూరు ఎస్పీ సతీశ్‌కుమార్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు నుంచి నిందితులను బలవంతంగా నైనా పోలీస్‌ కార్యాలయానికి తీసుకురావాలంటూ వారు ఆదేశాలిచ్చాయి. దీంతో పోలీసు అధికారులు... నిందితులను తిరిగి తీసుకువచ్చేందుకు సిబ్బందిని పంపారు. కోర్టు నుంచి తిరిగి పోలీస్‌ కార్యాలయానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులపై మాధవ్‌ విరుచుకుపడ్డారు. అడ్మిన్‌ ఏఎస్పీ రమణకుమార్‌తో వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, పేర్ని నాని తదితరులు జోక్యం చేసుకుని పోలీసులతో మాట్లాడుతుండగా.. మాధవ్‌ హడావుడిగా కోర్టు హాల్లోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వెనుతిరిగారు.


దోమల ధాటికి నిద్రలేక లాక్‌పలో సతమతం

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఆయన అనుచరులు నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ లాక్‌పలో గురువారం రాత్రంతా గడిపారు. లాక్‌పలో అరుగుపై మాధవ్‌ పడుకున్నారు. అయితే, దోమల ధాటికి ఆయనకు సరిగా నిద్ర పట్టలేదు. గతంలో సీఐగా ఎంతోమంది నిందితులను అరెస్టు చేసి లాక్‌పలో వేసిన ఆయన, చివరకు తనే లాక్‌పలో రాత్రంతా గడపాల్సి వచ్చింది.

లోక్‌సభ స్పీకర్‌ అనుమతి అక్కర్లేదు

గోరంట్ల మాధవ్‌కు బెయిల్‌ ఇప్పించేందుకు మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది మనోహర్‌ రెడ్డితో పాటు పలువురు న్యాయవాదులు రంగంలోకి దిగారు. గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట వాదనలు వినిపించారు. మాధవ్‌ లోక్‌సభ మాజీ సభ్యుడని, అరెస్టుకు ముందుగా సెక్షన్‌ 195 ప్రకారం లోక్‌సభ స్పీకర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పొన్నవోలు వాదించారు. కేసులో సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవే కాబట్టి 41ఎ నోటీసు జారీ చేసి పంపవచ్చని వాదించారు. ప్రాసిక్యూషన్‌ తరపున ఏపీపీ శౌరి, ఐదో మున్సిఫ్‌ మేజిస్ట్రేట్ కోర్టు ఏపీపీ పవన్‌కుమార్‌ వాదనలు వినిపించారు. మాధవ్‌పై నమోదైన నేరానికి సంబంధించి 195 వర్తించదని, మాజీ లోక్‌సభ సభ్యుని అరెస్టుకు స్పీకర్‌ అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని వాదించారు. గౌరవ లోకసభ మాజీ సభ్యుడు, మాజీ పోలీస్‌ అధికారి అయినప్పటికీ ఆయన చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని పోలీసుల ఐదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేశారని, పోలీస్‌ కారు అద్దాలు ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. మాధవ్‌కు రిమాండ్‌ విధించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న స్పెషల్‌ మొబైల్‌ కోర్టు మేజిస్ట్రేట్ జి. స్రవంతి గోరంట్ల మాధవ్‌ సహా నిందితులకు రిమాండ్‌ విధించారు కాగా ఏపీపీలకు మద్దతుగా టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు శ్రీరామ్‌ రాజీవ్‌ ఆనంద్‌, కట్టా కాళిదాసు, పారి బాబురావు, వేమూరు శ్రీనివాసరావు తదితరులు కోర్టుకు వచ్చారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 12 , 2025 | 04:48 AM