ఎరువులు దొరకవనే అపోహ వద్దు: అగ్రి డైరెక్టర్
ABN , Publish Date - Jul 05 , 2025 | 06:16 AM
ఖరీఫ్ పంటలకు అవసరమైన ఎరువులు దొరకవనే అపోహలు వద్దని, కొరత ఉందనే దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు కోరారు.

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ పంటలకు అవసరమైన ఎరువులు దొరకవనే అపోహలు వద్దని, కొరత ఉందనే దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు కోరారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేసి, అవసరం మేరకు ప్రైవేట్ డీలర్లు, సొసైటీలు, రైతుసేవా కేంద్రాల్లో ఎరువులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మార్క్‌ఫెడ్, సొసైటీలు, రైతుసేవా కేంద్రాలు, డీలర్ల వద్ద 8.73లక్షల టన్నుల ఎరువుల లభ్యత ఉండగా, యూరియా 3.12లక్షల టన్నులు ఉన్నాయని తెలిపారు. వచ్చే 3 నెలల్లో మరో 4.50లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, ఎమ్మార్పీ కన్నా అధికంగా అమ్మినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పంటల సరళిని బట్టి ఆయా ప్రాంతాలకు ముందుగా ఎరువులు సరఫరా చేయాలని కంపెనీలను కోరారు.