రామ్‌కో సిమెంట్ పరిశ్రమలో తీవ్ర ఉద్రిక్తత
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:00 AM
మండలంలోని రామ్‌కో సిమెంట్ పరిశ్రమలో సోమవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది.

కల్వటాలవాసిపై కాంట్రాక్ట్ కంపెనీ ఉద్యోగుల దాడి
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
కొలిమిగుండ్ల, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని రామ్‌కో సిమెంట్ పరిశ్రమలో సోమవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. కల్వటాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు క్రిష్ణరంగారెడ్డి రామ్‌కో పరిశ్రమలోని ఓ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధి వద్దకు వెళ్లి వర్కులపై చర్చించారు. స్థానికంగా ఉన్న తమకు కాంట్రాక్ట్ పనులు కల్పించాలని కోరారు. అయితే సదరు ప్రతినిధి నిర్లక్ష్యంగా, అవమానకర రీతిలో సమాధానం చెప్పడంతో మాటామాటా పెరిగి, ఘర్షణ పడ్డారు. ఇంతలోనే సిబ్బంది టీడీపీ నాయకుడిపై దాడికి యత్నించారు. అనుచరులపై దాడి చేసి గాయపరిచారు. ఓ వాహనంపై దాడి చేయడంతో అద్దాలు పగిలిపోయాయి. దీంతో పరిశ్రమలో ఏం జరుగుతుందో అర్థంకాక కిందిస్థాయి సిబ్బంది, కార్మికులు తీవ్ర ఆందోళన చెందారు. గతంలో ఎన్నడూలేని విధంగా కాంట్రాక్ట్ కంపెనీలో పనిచేసే నానలోకల్ సిబ్బంది స్థానికులపైనే దాడికి యత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. రామ్‌కో సిమెంట్ పరిశ్రమలో ఉద్రిక్తత తెలుసుకున్న సీఐ రమేష్‌బాబు హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు రామ్‌కో సిమెంట్ పరిశ్రమ అధికారులు, ఉద్యోగులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. అయితే ఇరువర్గాలు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని సీఐ వెల్లడించారు.