Municipal Department: అర్హత, శిక్షణ ఉంటేనే డిప్యుటేషన్
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:37 AM
తగిన అర్హత, శిక్షణ ఉంటేనే ఇకపై మున్సిపల్ శాఖలో కమిషనర్, అడిషనల్ కమిషనర్‌గా పని చేసేందుకు అవకాశం ఇస్తారు.

పీఆర్, రెవెన్యూ, స్టేట్ ఆడిట్, సచివాలయ శాఖల వారికి మాత్రమే
కొత్త మార్గదర్శకాలతో మున్సిపల్ శాఖ ఉత్తర్వులు
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): తగిన అర్హత, శిక్షణ ఉంటేనే ఇకపై మున్సిపల్ శాఖలో కమిషనర్, అడిషనల్ కమిషనర్‌గా పని చేసేందుకు అవకాశం ఇస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వీటి ప్రకారం.. పట్టణ పాలన, సమస్యలపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న సంబంధిత మున్సిపల్ సంస్థ గ్రేడ్‌కు అనుగుణంగా జీతభత్యాలు పొందే అధికారులు మాత్రమే అర్హులవుతారు. పంచాయతీరాజ్‌శాఖకు చెందిన ఎంపీడీవోలు, డీఎల్‌డీవోలు, డిప్యూటీ సీఈవోలు, జిల్లా పరిషత్ సీఈవోలను వివిధ గ్రేడ్‌ల మున్సిపాలిటీలకు నియమిస్తారు. రెవెన్యూ శాఖ నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్టేట్ ఆడిట్ శాఖ నుంచి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు, జిల్లా ఆడిట్ ఆఫీసర్లు, సచివాలయ శాఖ నుంచి సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్రటరీలను డిప్యుటేషన్‌పై నియమించనున్నారు. డిప్యుటేషన్‌పై వచ్చే అధికారులకు ప్రొబేషన్, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసి, ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. విజిలెన్స్ క్లియరెన్స్, మాతృ శాఖ అనుమతి ఉండాలి. డిప్యుటేషన్‌పై వచ్చేవారికి శాఖాపరమైన శిక్షణ ఇస్తారు.