Share News

Endowments Department: దేవుడా.. శ్రీవాణి నిధులివ్వవా

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:16 AM

ఆలయాల నిర్మాణాలకు అనుమతులిస్తారు. కానీ బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో పెట్టుకుంటే ఆలయ నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియదు.

Endowments Department: దేవుడా.. శ్రీవాణి నిధులివ్వవా

  • కొత్త ఆలయాల నిర్మాణాల్లో తీవ్రజాప్యం

  • నిధుల విడుదలకు టీటీడీ కొర్రీలు

  • పనులు ఆపేస్తున్న కాంట్రాక్టర్లు

  • దేవదాయ శాఖకు తలనొప్పులు

  • నీరుగారుతున్న శ్రీవాణి ట్రస్ట్‌ లక్ష్యం

  • భక్తుల నుంచి తీవ్ర విమర్శలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆలయాల నిర్మాణాలకు అనుమతులిస్తారు. కానీ బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో పెట్టుకుంటే ఆలయ నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియదు. కష్టమో.. నష్టమో.. సొంత డబ్బులతో ఆలయాల నిర్మించుకోవడమే మంచిది. శ్రీవాణి పేరుతో టీటీడీ ఇచ్చే నిధులపై భక్తుల అభిప్రాయం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కొత్త ఆలయాల నిర్మాణాలతో పాటు మరికొన్ని పాత ఆలయాల జీర్ణోద్దరణకు శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా టీటీడీ ఆర్థిక సహకారం అందిస్తుంది. రాష్ట్రం లో హిందూధర్మ అభివృద్ధి కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాలను నిర్మించి ఆయా వర్గాల్లో భక్తికి పెంపొందించేందుకు టీటీడీ ఈ పథకం తీసుకువచ్చింది. కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పాత ఆలయాల పునర్మిణానికి 20 శాతం నిధులు ఆయా ఆలయాల పాలక మండలి లేదా గ్రామస్థులు సమకూరిస్తే మిగిలిన మొత్తాన్ని శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా టీటీడీ అందిస్తుంది. ఈ మొత్తం నిధులతో ఆలయాల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.


అనుమతుల్లో వేగం..నిధుల విడుదలలో నిర్లక్ష్యం

టీటీడీ లక్ష్యం ఇప్పుడు నీరుగారిపోతోంది. శ్రీవాణి ట్రస్ట్‌ నుంచి ఆలయాల నిర్మాణాలకు అనుమతులిచ్చే సమయంలో ఉన్నంత వేగం.. నిధుల విడుదలలో ఉండడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో చాలా ఆలయాల నిర్మాణాలు శ్రీవా ణి ట్రస్ట్‌ నిధులతో ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఆలయాల నిర్మాణాలు చేపడితే, గత ప్రభుత్వంలో మరికొన్ని ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు ఏ ఆలయానికి కూడా నిధులు విడుదల చేయడం లేదు. టీటీడీ ఎస్‌ఈ, ఈఈల కార్యాలయాల్లోనే ఏదో ఒక కొర్రీ వేసి బిల్లులు విడుదల చేయడం లేదు. వందల సంఖ్యలో ఆలయ నిర్మాణాలు మొదలై కొంతమేర పనులు పూర్తి అయిన తర్వాత శ్రీవాణి నుంచి నిధులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే ఆపేస్తున్నారు. బిల్లులు రాకుండా పనులు ఎలా చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక దేవదాయ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టీటీడీ అధికారుల వ్యవహారంతో శ్రీవాణి నిధులంటేనే గ్రామస్థులు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది.


ప్రత్యేక దృష్టి పెడితేనే..

ఆలయాల నిర్మాణం కోసం దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి టీటీడీ బోర్డుకు ప్రతిపాదనలు పంపడం తరువాయి ఆగమేఘాలపై అనుమతులు వస్తాయి. ఆ తర్వాతే టీటీడీ అధికారుల వ్యవహారంతో కథమారిపోతుంది. కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్‌ విచారణ పేరుతో మరింత ఆలస్యం చేస్తున్నారు. దీంతో గ్రామస్థాయిలో శ్రీవాణి నిధులపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం రూ.11 కోట్లు నిధులు విడుదల కాకపోవడంతో ఇటీవల పలు ఆలయాల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్‌ అనేకసార్లు టీటీడీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యం. టీటీడీ చైర్మన్‌, ఈవో నిధుల విడుదలకు ఆమోదం తెలిపినా కూడా కిందస్థాయి సిబ్బంది వ్యవహారశైలి కారణంగా మొత్తం వ్యవస్థ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తో ంది. శ్రీవాణి ట్రస్ట్‌ నిధుల విడుదలపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తే తప్ప ఆలయాల నిర్మాణాలు ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై టీటీడీ దృిష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 05:16 AM