CM Chandrababu: మొంథా నష్టం 5,265 కోట్లు
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:02 AM
మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలో రూ.5,265 కోట్ల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ఇది ప్రాథమిక అంచనా: సీఎం
ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు, సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా లెక్కించాం
పూర్తిస్థాయి నివేదిక రూపొందించాక కేంద్రానికి!
తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం.. రియల్‌టైమ్‌లో నిరంతరం పర్యవేక్షించాం.. డేటా బేస్‌తో ముందస్తు చర్యలు
సీఎస్ నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు పంచ సూత్ర ప్రణాళికతో బాగా పని చేశారు
క్షేత్ర స్థాయి పర్యటనలతో ప్రజలకు మరింత భరోసా: సీఎం
నష్టం ఇలా...
పంటలకు 829 కోట్లు
రోడ్లకు 2,079 కోట్లు
ఆక్వాకు 1,270 కోట్లు
‘పర్యవేక్షణ, అప్రమత్తత, రక్షణ, పునరావాసం, సాధారణ పరిస్థితి’ అనే పంచ సూత్ర ప్రణాళికతో అధికార యంత్రాంగం చక్కగా పని చేసింది. భవిష్యత్‌లో టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తాం.
- సీఎం చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలో రూ.5,265 కోట్ల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శాటిలైట్ చిత్రాలు, డ్రోన్లు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నష్టాన్ని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ తుఫాన్‌ను రియల్ టైమ్‌లో పర్యవేక్షించి, ముందు జాగ్రత్తతో నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని, ప్రభుత్వ చర్యలకు టెక్నాలజీ బాగా ఉపయోగపడిందని చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం విలేకరులతో మాట్లాడారు. తుఫాన్ వల్ల వ్యవసాయ పంటలకు రూ.829 కోట్లు, ఉద్యాన పంటలు-39 కోట్లు, పట్టు పరిశ్రమ-65 కోట్లు, ఆక్వా-1,270 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు-2,079 కోట్లు, పురపాలక శాఖ-109 కోట్లు, జలవనరుల విభాగం-207 కోట్లు, పంచాయతీరాజ్-8 కోట్లు, విద్యుత్ శాఖ-16 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.71 లక్షలు నష్టం వాటిల్లగా.. రాష్ట్రవ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని చెప్పారు. త్వరలోనే నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి, కేంద్రానికి నివేదిక పంపుతామన్నారు. మొంథా బీభత్సాన్ని సృషిస్తుందని దాని గమనాన్ని బట్టి ముందుగానే అంచనా వేశామని చెప్పారు. ‘తుఫాన్‌ను ఆపగలిగే అవకాశం లేకపోయినా.. వీలైనంత వరకు ప్రాణ, ఆస్తి నషాలను నివారించగలిగాం. ఆ దిశగా ఐదు రోజులు రేయింబవళ్లూ యంత్రాంగం పని చేసింది. రియల్‌టైమ్ మానిటరింగ్, టెక్నాలజీ సత్ఫలితాలిచ్చాయి’ అని వివరించారు. ‘వన్ గవర్నమెంట్, వన్ సిటిజన్’ నినాదంతో పనిచేస్తున్నామన్నారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
మొంథా అనుభవంతో మాన్యువల్
విపత్తులను ఎదుర్కొనేందుకు మొంథా తుఫాన్ అనుభవంతో ఓ మాన్యువల్ తయారుచేస్తాం. ముఖ్యమంత్రిగా చాలా తుఫాన్లను హ్యాండిల్ చేశా. గత 16 నెలల్లో టెక్నాలజీని సమగ్రంగా తయారుచేశాం. దానిని తాజా తుఫాన్ సమయంలో ఒక పద్ధతి ప్రకారం వాడాం. విభిన్న శాఖలు సమన్వయంతో పనిచేశాయి. డేటాబేస్ తీసుకుని అందరి ఆధార్ అథెంటికేషన్‌తో ప్రతి ఇంటికీ జియోట్యాగ్ చేశాం. డ్రోన్లను వాడాం. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారాన్ని అందించి.. తుఫాన్ కదలికలను గమనించి.. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, ఫైర్ ఇంజన్లను సిద్ధం చేశాం. తుఫాన్ చాలా సమస్యలు సృష్టించి దాగుడు మూతలాడింది. కాకినాడ దగ్గర తీరం దాటుతుందని అంచనా ఉంటే.. తీవ్రత నెల్లూరులో ప్రారంభమై.. కావలి, బాపట్ల, మచిలీపట్నం మీదుగా రాజోలు దగ్గర తీరాన్ని తాకింది. వాన పడుతుందనుకున్న చోట పడలేదు. లక్షా 16 వేల మందిని శిబిరాలకు తరలించి.. ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాం.
పని చేసినవారందరికీ అభినందనలు
సీఎం నుంచి మంత్రులు, అధికారులు, క్షేత్ర స్థాయి ఉద్యోగులు, సిబ్బంది సమర్థంగా పని చేయడం వల్లే నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగాం. మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. తద్వారా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించాం. సీఎస్ నుంచి కలెక్టర్.. క్షేత్ర స్థాయిలో సచివాలయ సిబ్బంది వరకు ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. ఆర్‌టీజీఎస్ నుంచి మంత్రులు లోకేశ్, అనిత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు చేశారు. ఆర్‌టీజీఎ్‌సలోని యువ ఐఏఎ్‌సలతో పాటు అధికారులంతా చక్కగా పనిచేశారు. కలెక్టర్లు పోటీ పడి పనిచేశారు. అంతా సమష్టిగా పని చేయబట్టే.. నష్ట నివారణ సాధ్యమైంది. వారందరికీ అభినందనలు.
‘ఏపీఎయిమ్స్ యాప్’లో పంట నష్టం నమోదు
పంట నష్టాన్ని ఏపీ ఎయిమ్స్(ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్‌ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) యాప్‌ల ద్వారా నమోదు చేయనున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక సీఎస్ బి.రాజశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఉపగ్రహ ఛాయా చిత్రాలు, ఇతర సాంకేతిక సమాచారం ఆధారంగా కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేయనున్నట్లు తెలిపారు.