Share News

CM Chandrababu: మరింత సులభంగా పౌర సేవలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:21 AM

ప్రభుత్వం అందించే పౌర సేవలన్నీ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

CM Chandrababu: మరింత సులభంగా పౌర సేవలు

  • ప్రభుత్వ శాఖల సమాచారం కోసం ఏపీ సెర్చ్‌బార్‌: సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందించే పౌర సేవలన్నీ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌర సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరాలని స్పష్టం చేశారు. ఇందుకోసం సాంకేతికతను జత చేయాలని సూచించారు. ప్రజల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని డేటా అనలిటిక్స్‌తో విశ్లేషించుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందిస్తున్న సేవల విషయంలో టెక్నాలజీ ఆడిటింగ్‌ను కూడా నిర్వహించాలన్నారు. వీటితోపాటు మంత్రులు, అధికారులు ఫైళ్ల క్లియరెన్సులో ఎంత సమయం తీసుకుంటున్నారన్న అంశాన్ని కూడా బేరీజు వేస్తామని పేర్కొన్నారు. తద్వారా ఏ స్థాయిలో ఎక్కువ ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయన్న వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ శాఖకు సంబంధించిన సమాచారాన్ని అయినా ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఏపీ సెర్చ్‌బార్‌ను అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. ఉచిత ఇసుక, ఇతర సేవలు అందిస్తున్న వెబ్‌సైట్లు, యాప్‌లను ప్రజలు సులువుగా ఉపయోగించేలా ఉండాలని స్పష్టం చేశారు. వివిధ శాఖల సమాచారాన్ని ‘డేటా లేక్‌’ ద్వారా త్వరలోనే అనుసంధానిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 06:22 AM