Share News

CM Chandrababu: అన్నదాతకు అండగా..

ABN , Publish Date - Aug 03 , 2025 | 03:31 AM

అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రైతులకు సాగులో ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అన్నదాత సుఖీభవను అమలు చేస్తున్నామన్నారు.

CM Chandrababu: అన్నదాతకు అండగా..

  • చంద్రన్న ఉన్నంత వరకు భరోసా

  • సాగుకు చేయూతగా అన్నదాత సుఖీభవ

  • ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అమలు

  • 46.86 లక్షల మంది రైతులకు రూ.3,174 కోట్ల నిధులు విడుదల

  • కేంద్ర సాయంతో కలిపి ఏటా 20 వేలు

  • వ్యవసాయంలో సాంకేతికతకు పెద్దపీట

  • వచ్చే సీజన్‌కు వెలిగొండ తొలిదశ పూర్తి

  • మేలు చేసే ప్రభుత్వానికి అండగా నిలవండి

  • ప్రకాశం జిల్లా తూర్పువీరాయపాలెం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు

సాగునీటి రంగంపై 2014-19లో టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.67 వేల కోట్లు ఖర్చు చేస్తే.. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కూటమి ప్రభుత్వం తిరిగి ఈ రంగంపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రకాశం జిల్లా కరువు నివారణ కోసం చేపట్టిన వెలిగొండ తొలిదశను వచ్చే సీజన్‌కు పూర్తి చేసి నీరిస్తాం.

- సీఎం చంద్రబాబు

ఒంగోలు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రైతులకు సాగులో ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ‘అన్నదాత సుఖీభవ’ను అమలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌తో ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్రప్రభుత్వం ఈ పథకం కింద రూ.14 వేలు కలిపి ఏటా రూ.20 వేల నగదును జమ చేస్తుందని అన్నారు. చంద్రన్న ఉన్నంతవరకు రైతుకు భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో తొలివిడతగా 46.86 లక్షల మంది రైతులకు సుమారు రూ.3,174.42 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమ చేశారు. ఇందుకు సంబంధించిన మెగా చెక్‌ను మహిళా రైతులు నాగలక్ష్మి, షేక్‌ మున్నాలకు అందజేశారు.


ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం ద్వారా అందుతున్న లబ్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. సాధారణ సభలకు భిన్నంగా పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో పచ్చని పొలాల మధ్య సుమారు రెండు గంటల పాటు కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వ్యవసాయంలో సాంకేతిక వినియోగం, ప్రకృతి సేద్యం, మైక్రో ఇరిగేషన్‌ అమలు, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కరోనాను సైతం జయించి పంటల సాగు చేసిన రైతన్నకు అండగా టీడీపీ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. అందుకే ధరలు లేక నష్టపోతున్న నల్లబర్లీ పొగాకు, మామిడి, కోకో ఆయిల్‌ రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆదుకున్నామన్నారు. ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఇక్కడ సాగుపై పడుతున్నాయని, అమెరికా అధ్యక్షుడు ఆకస్మికంగా ప్రకటించిన పన్నుల వల్ల ఇక్కడ ఆక్వా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రతికూలత ఉంటుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. వ్యవసాయంలో రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిందని చంద్రబాబు చెప్పారు. గోదావరి-బనకచర్ల పథకం ద్వారా రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.


15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం

ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్ర్తీశక్తి పథకం అమలులోకి రానుందని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో 2.62 కోట్లమందికి ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుందన్నారు. ఉచితంగా 3 సిలిండర్లు, నెలనెలా 1న పేదల సేవలో పేరుతో సామాజిక పింఛన్లు, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి రూ.15వేల నగదు ఇప్పటికే అమలు చేస్తున్నామని చెప్పారు. అప్పుడప్పుడు కొత్త బిచ్చగాళ్లు వచ్చి అబద్ధాలు చెబితే నమ్మవద్దని ప్రజలను కోరారు. ఎన్ని కష్టాలు ఉన్నా పేదల సంక్షేమం కోసం, ప్రజల సుఖం కోసం పనిచేస్తానన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్‌ కల్యాణ్‌ కలిసి రావ డం, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేస్తే ప్రజ లు మంచి ఫలితాలు ఇచ్చారని అన్నారు. ఈ రోజు సభలో ప్రధాని ఆపరేషన్‌ సిందూర్‌ గురించి మాట్లాడారని, ఆడబిడ్డలు బొట్టు తుడిచేసిన వారిని మట్టుబెట్టిన ఘనత నరేంద్రమోదీదని ప్రశంసించారు. నాలుగో సారి కూడా దేశంలో ఎన్‌డీఏ అఽధికారంలోకి వస్తుందన్నారు.


డబ్బులు పడ్డాయ్‌!

సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి పర్యటన ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి చెక్కులు అందజేసిన అనంతరం ఆయన ప్రసంగం ప్రారంభించారు. ఆ సమయంలో ఒక రైతు సెల్‌లో మెసేజ్‌ చూసుకొని తన బ్యాంకు ఖాతాలో అన్నదాత సుఖీభవ నగదు జమ అయిందని ఆనందంతో కేరింతలు కొడుతూ చెప్పాడు. సెల్‌ ఫోన్‌ పైకెత్తి మెసేజ్‌ చూపాడు. అందుకు స్పందించిన సీఎం.. ఆనందంగా ఉందా అని అడిగారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే తమ ఽధ్యేయమని స్పష్టం చేశారు. డబ్బులు పడిన వెంటనే రైతులు మెసేజ్‌లు చూసుకోవటం చంద్రబాబు గమనించి సెల్‌ ఫోన్‌ను ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చన్నారు.

Untitled-3 copy.jpg


99.98శాతం ఖాతాల్లో సొమ్ము

సీఎం చంద్రబాబు ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌’ లబ్ధిదారులకు రూ.3,174.43 కోట్లు విడుదల చేయడంతో గంటల వ్యవధిలోనే 99.98శాతం మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు చేరింది. ఈ పథకానికి అర్హులైన 46.86 లక్షల రైతు కుటుంబాల్లో 44.76 లక్ష ల మంది బ్యాంకు ఖాతాల్లో నగదు జమైంది. 44.75 లక్షల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని ఆర్టీజీఎస్‌ ప్రకటించింది. పీఎం కిసాన్‌ 20వ విడత నిధులను ప్రధాని మోదీ శనివారం వారాణసీలో విడుదల చేశా రు. అదే సమయంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఈ విడత పీఎం కిసాన్‌ కింద రూ.2వేలు రాగా, అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు జమయ్యాయి. దీంతో రికార్డు స్థాయిలో రైతుకు రూ.7 వేలు అందింది. గత ప్రభుత్వంలో జగన్‌ ‘రైతుభరోసా’కు బటన్‌ నొక్కిన 10-15 రోజులకు కూడా పడేది కాదని రైతులు గుర్తు చేస్తున్నారు. కాగా, ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 46.86లక్షల మంది లబ్దిదారులను గుర్తించగా, ప్రస్తు తం స్థానిక ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ’కోడ్‌’ కారణంగా అన్నదాత సుఖీభవ సొమ్ము విడుదలకు బ్రేక్‌ పడింది. పీఎం కిసాన్‌కి మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దీంతో స్థానిక ఎన్నికల కోడ్‌ సడలించిన తర్వాత ఆయా ప్రాంతాల్లోని సుమా రు లక్ష మంది రైతుల ఖాతాలకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని అధికారులు ప్రకటించారు.

Updated Date - Aug 03 , 2025 | 03:36 AM