Class 5 Student: గురుకుల పాఠశాలలో దారుణం.. విద్యార్థి పీక కోసి తోటి విద్యార్థులు..
ABN , Publish Date - Nov 15 , 2025 | 10:28 AM
చింతలపూడి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని విద్యార్థులు ఆనంద్ కుమార్ అనే బాలుడిపై కత్తితో దాడి చేశారు. అతడి పీక కోసేశారు.
ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి పీక కోసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. తీవ్ర గాయంతో ఆ విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మారుముళ్ల ఆనంద్ కుమార్ అనే 10 ఏళ్ల బాలుడు చింతలపూడి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. అర్థరాత్రి వేళ గుర్తు తెలియని కొందరు విద్యార్థులు ఆనంద్ కుమార్‌పై దాడి చేశారు.
అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అతడి పీక కోసేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. తీవ్ర గాయంతో ఆనంద్ కుమార్ విలవిల్లాడసాగాడు. నొప్పి తట్టుకోలేక కేకలు వేయటం మొదలెట్టాడు. పక్కనే ఉన్న విద్యార్థులు నిద్రలేచారు. తీవ్ర గాయంతో ఉన్న ఆనంద్ కుమార్‌ను చూసి షాక్ అయ్యారు. వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాయు వేగంతో స్పందించిన హాస్టల్ సిబ్బంది ఆనంద్ కుమార్‌ను హుటాహుటిన చింతలపూడి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు బాలుడి కంఠం మీద ఐదు కుట్లు వేశారు. ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, పోలీసులకు ఈ సంఘటనపై సమాచారం వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు ఆనంద్ కుమార్ ఇద్దరు విద్యార్థులపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి