Share News

SIT Police: చెవిరెడ్డి చిందులు

ABN , Publish Date - Jul 04 , 2025 | 03:23 AM

మద్యం కుంభకోణంలో అరెస్టయిన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పోలీసుల్నే బెదిరిస్తున్నారు. అరెస్టు నుంచి కస్టడీ దాకా... రిమాండ్‌లో ఉన్నప్పుడూ ఆయన బెదిరింపులకు దిగుతున్నారు.

SIT Police: చెవిరెడ్డి చిందులు

  • ప్రశ్నలు వేస్తే ఎదురు దాడి ఆధారాలు చూపితే ఆగ్రహం

  • మూడురోజుల సిట్‌ విచారణలో సీపీ నాయకుడి వింత ప్రవర్తన

  • తానే ప్రశ్నిస్తూ.. వార్నింగ్‌ ఇస్తూ హల్‌చల్‌

  • మీ సంగతి తేలుస్తా..అందరి చరిత్ర తెలుసు.. ప్రభుత్వం రాగానే ఎవరినీ వదలిపెట్టను

  • మద్యం ముట్టని నాపై లిక్కర్‌ కేసా?

  • నన్ను ప్రశ్నించమన్నది ఎవరంటూ ఫైర్‌

  • అదంతా వీడియోతీసిన సిట్‌ అధికారులు

  • ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మద్యం కుంభకోణంలో అరెస్టయిన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పోలీసుల్నే బెదిరిస్తున్నారు. అరెస్టు నుంచి కస్టడీ దాకా... రిమాండ్‌లో ఉన్నప్పుడూ ఆయన బెదిరింపులకు దిగుతున్నారు. మూడు రోజుల విచారణలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వింత ప్రవర్తన, హెచ్చరికలు చేసిన వైనాన్ని సిట్‌ అధికారులు వీడియో తీశారు. దానిని ఏసీబీ కోర్టుకు వారు సమర్పించనున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లో లిక్కర్‌ వ్యాపారుల నుంచి రాజ్‌ కసిరెడ్డి(ఏ-1) ముడుపులు తీసుకుని ఏపీలో వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల్లో పంచేందుకు చెవిరెడ్డి ద్వారా పంపిణీ చేసినట్లు సిట్‌ గుర్తించింది. వీడియో ఫుటేజీలు, వాంగ్మూలాలు, టవర్‌ లొకేషన్లన్నీ సేకరించిన సిట్‌ అధికారులు, అందుకు అనుగుణంగా చెవిరెడ్డిని ప్రశ్నించారు. అయితే, ఏ ప్రశ్న అడిగినా పొంతనలేని సమాధానాలు చెప్పారని, ‘మీరు అడిగితే ఎందుకు చెప్పాలి? నేను చెప్పింది రికార్డు చేసుకోండి’ అంటూ కేసుతో సంబంధం లేని రాజకీయపరమైన ప్రకటనలు ఇచ్చారని తెలిసింది. సిట్‌ కూడా అంతే దీటుగా ఆయనతో వ్యవహరిచినట్లు సమాచారం. ‘‘రాజకీయ ప్రకటనలు బయట ఇచ్చుకోండి..మాకు కేసు విషయాలు మాత్రమే చెప్పండి.. డబ్బులు హైదరాబాద్‌లో తీసుకుని పలుమార్లు విజయవాడ, తాడేపల్లికి తీసుకొచ్చారు.. అక్కడ డంప్‌లో పెట్టి ఆ తర్వాత ఒంగోలు, తిరుపతికి తరలించారు.. ఇవిగో మీ కార్లు, వాటి నంబర్లు చూడండి..’’ అంటూ ఫోటోలు చూపించారు. దీంతో చెవిరెడ్డిలోని మరో కోణం బయటికి వచ్చింది. ‘‘నన్ను ఈ ప్రశ్నలు అడగమని మీకు చెప్పిందెవరు.. నాకు మద్యం అలవాటు లేదు.. ఎన్నికల్లో ఎప్పుడూ పంచలేదు.. నాపై లిక్కర్‌ కేసు పెడతారా.? మీ అందరి చరిత్ర నాకు తెలుసు. మేం అధికారంలోకి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టను..’’ అంటూ సిట్‌ అధికారులకే చెవిరెడ్డి వార్నింగ్‌ ఇచ్చారని తెలిసింది.


జైల్లోనూ అదే తీరు..

విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి జైలు అధికారులను విసిగిస్తున్నట్లు తెలిసింది. లాక్‌పలోకి వెళ్లకుండా అటూ ఇటూ తిరగడం.. వంట గదిలోకి దూసుకెళ్లి ఏమి వండుతున్నారంటూ చూడటం, ఆహారం ప్లేటులో తనే వడ్డించుకుని వెళ్లడం చేశారు. ఇది జైలులో ప్రవర్తించే తీరు కాదని జైలు అధికారులు వారించే ప్రయత్నం చేశారు. అయితే, చెవిరెడ్డి ఒక ఉన్నతాధికారి పేరు చెప్పి ‘మా మావకు నేనే చెబుతా..మీ రేంది చెప్పేది’ అంటూ వారిని బెదిరించినట్లు తెలిసింది. దెబ్బకు ఆ ఉన్నతాధికారి జైలుకు వచ్చి ‘నీకు, నాకు స్నేహం ఉంటే అదంతా బయట. ఇక్కడ కాదు. సీసీ కెమెరాలు ఉన్నాయి’ అని హితబోధ చెయ్యడంతో తగ్గినట్లు సమాచారం. జైలులో ఖైదీలు వారానికి రెండు సార్లు కుటుంబసభ్యులతో ఫోనులో మాట్లాడుకునే అవకాశం ఉంది. ఒక రోజు చెవిరెడ్డి మాట్లాడేందుకు ఫోను అడిగారు. ‘చార్జింగ్‌ అవుతోంది కాసేపు ఆగండి’ అని బదులిచ్చిన జైలు ఉద్యోగిపై చెవిరెడ్డి చిందులేశారు. మూడు రోజుల క్రితం సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకోవడానికి వెళ్లినప్పుడు.. జైలు బ్యారక్‌ నుంచి తీసుకొచ్చి ప్రధాన గేటు లోపల కూర్చోబెట్టారు. అక్కడ కొంచెం ఆలస్యం కావడంతో ‘నన్ను ఇక్కడెందుకు కూర్చోబెట్టారు. నేను లాక్‌పలోకి వెళ్తా’నంటూ విసిగించారు. ఇవన్నీ భరించలేక జైలు సూపరిండెంట్‌ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. సిబ్బందికి ధైర్యం చెప్పిన జైళ్లశాఖ ఉన్నతాధికారులు రిమాండ్‌ ఖైదీ చెవిరెడ్డి ప్రవర్తనపై నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం.


ముగిసిన కస్టడీ

విజయవాడ, జూలై 3(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంకేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని స్నేహితుడు చెరుకూరి వెంకటేష్‌ నాయుడుల కస్టడీ ముగిసింది. గురువారం సిట్‌ కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం వారికి ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయాధికారి పి.భాస్కరరావుకు తన సమస్యను చెవిరెడ్డి విన్నవించుకున్నారు. తాను కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, తిరుపతిలోని స్విమ్స్‌లో ఎప్పటి నుంచో వైద్యం చేయించుకుంటున్నానని తెలిపారు. తనను అక్కడికి పంపించాలని వేడుకున్నారు. దీంతో చెవిరెడ్డిని విజయవాడలో దగ్గరగా ఉన్న ఆస్పత్రిలో చూపించాలని జైలు అధికారులను న్యాయాధికారి ఆదేశించారు. అనంతరం చెవిరెడ్డి, వెంకటేష్‌ నాయుడులను జైలుకు తరలించారు.

Updated Date - Jul 04 , 2025 | 03:25 AM