Cell Phone Usage: కడప సెంట్రల్ జైలులో ఖైదీల సెల్‌ఫోన్ వాడకం వాస్తవమే..
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:39 AM
కడప సెంట్రల్ జైలులో ఖైదీలు సెల్‌ఫోన్ వాడుతున్నారన్నది వాస్తవమని తేలడంతో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది.

ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
కడప, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కడప సెంట్రల్ జైలులో ఖైదీలు సెల్‌ఫోన్ వాడుతున్నారన్నది వాస్తవమని తేలడంతో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల కాలంలో జైలులో 12 ఫోన్లు దొరికాయి. సెల్‌ఫోన్ల వినియోగంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం కూడా వచ్చింది. దీంతో ప్రభుత్వం కోస్తా రేంజ్ డీఐజీ రవికిరణ్‌ను విచారణాధికారిగా నియమించింది. ఆయన వారం రోజుల పాటు చేసిన విచారణలో సెల్‌ఫోన్ల వినియోగం వాస్తవమని తేలింది. దీనికి బాధ్యులుగా పరిగణిస్తూ డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్, జైలరు గోవిందరావు, జైలు వార్డర్లు అప్పారావు, వర్మ, నారాయణరావులను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డైరెక్టర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు.