Forced Marriage: ఆమెకు 22 అతనికి 42
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:51 AM
అన్నవరం దేవస్థానంలో వయస్సులో తేడాతో జరిగిన వివాహంలో వధువు కన్నీరు పెట్టడంతో భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాల మధ్య సమస్యను పెద్దలు పరిష్కరించాలని పోలీసులు సూచించారు

వధువు కన్నీరు పెట్టడంతో భక్తుల ఫిర్యాదు
అన్నవరం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): తన కంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి కన్నీటి పర్యంతమైంది. అన్నవరం దేవస్థానంలో జరిగిన ఈ పెళ్లిలో వధువు కన్నీటి పర్యంతమవడంతో భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలిలా.. ప్రకాశం జిల్లాకు చెందిన యువతి తండ్రి నిరుపేద కావడంతో కట్నకానుకలు లేకుండా, పెళ్లి ఖర్చులు మగపెళ్లి వారే భరించేలా వివాహం నిశ్చయించుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యనారాయణస్వామి దేవస్థానంలో శనివారం ఈ వివాహం జరిగింది. అయితే పెళ్లి ఇష్టంలేని అమ్మాయి తాళికట్టిన అనంతరం కన్నీరు పెట్టడం చూసిన పలువురు భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అన్నవరం ఎస్‌ఐ హరిబాబు.. ఇరు కుటుంబాలూ పెద్దల్లో పెట్టి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.