YSRCP MP Mithun Reddy: ముగిసిన సిట్ విచారణ..మిథున్ రెడ్డి సంచలన స్టేట్మెంట్..?
ABN , Publish Date - Apr 19 , 2025 | 07:29 PM
వైసీపీ హయాంలో అన్నీ తామై ఏక ఛత్రాధిపత్యం సాగించిన ఎంపీ మిథున్ రెడ్డికి ఇవాళ చుక్కలు కనిపించాయి. విజయవాడ సీపీ ఆఫీస్‌లో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆపసోపాలు..

YSRCP MP Mithun Reddy: వైసీపీ హయాంలో ఏక ఛత్రాధిపత్యం సాగించిన ఎంపీ మిథున్ రెడ్డికి ఇవాళ చుక్కలు కనిపించాయి. విజయవాడ సీపీ ఆఫీస్‌లో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మిథున్ రెడ్డి ఆపసోపాలు పడ్డట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంకి సంబంధించి చంద్రబాబు సర్కారు సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా అప్పటి వైసీపీ ప్రభుత్వంలో మద్యం దందా నడిపిన వైసీపీ బడా నేతలందరికీ నోటీసులిచ్చి ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఇందులో భాగంగానే నిన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టారు అధికారులు. ఇక ఇవాళ వైఎస్ జగన్‌కు ముఖ్య సహచరుడు.. ఆపార్టీ ఎంపీ అయిన మిథున్ రెడ్డి వంతు వచ్చింది.
విజయవాడ సీపీ ఆఫీసులో ఈ ఉదయం నుంచి మొదలైన విచారణ ఏకంగా ఏకబిగిన ఎనిమిది గంటల పాటు కొనసాగింది. దాదాపు 7 గంటలకు పైగా సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మిథున్ రెడ్డి న్యాయవాది సమక్షంలోనే విచారణ సాగింది. మద్యం పాలసీ రూపకల్పన, మిథున్ రెడ్డి ప్రమేయం, డిస్టిలరీల నుంచి ఏపి బేవరేజెస్ కార్పోరేషన్ మద్యం కొనుగోళ్లు పై సుదీర్ఘంగా ప్రశ్నలు అడిగారు సిట్ అధికారులు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం విధానాన్ని మొత్తం ప్లాన్ చేసిన రాజ్ కసిరెడ్డికి చెందిన ఆడాన్ డిస్టిలరీ, డికార్ట్ నుంచి ఏపి బెవరెజెస్ కార్పొరేషన్ ఎంత మేర మద్యం కొనుగోళ్లు జరిపిందనే అంశం మీదా సిట్ అధికారులు ప్రశ్నలు అడిగారు.
డిస్టిలరీల నుంచి ఎంత ధరకు మద్యం సరఫరా చేశారన్న విషయం పైనా ప్రశ్నలు వచ్చాయి. రాజ్ కసిరెడ్డి, అతని అనుచరులు చాణక్య , అవినాష్ రెడ్డి, కిరణ్, సైఫ్‌లతో మిథున్ రెడ్డికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి కూడా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే, అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు మిథున్ రెడ్డి సమాధానాలు దాట వేసినట్టు సమాచారం. విజయసాయి రెడ్డి ఇంట్లో మద్యం పాలసీల గురించి ఏం మాట్లాడుకున్నారన్నదానిపైనా మిథున్ రెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. చివరిగా మిథున్ రెడ్డి వాగ్మూలం నుంచి సంతకాలు తీసుకున్న తర్వాత సిట్ అధికారులు మిథున్ రెడ్డిని మళ్లీ అవసరమైతే పిలుస్తామని చెప్పి పంపించి వేశారు.
ఇవి కూడా చదవండి..