AP Village Secretariats Now A B C Categories: గ్రామ, వార్డు సచివాలయాల వర్గీకరణ
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:59 AM
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జనాభా ఆధారంగా వాటిని A, B, C కేటగిరీలుగా విభజించింది. ఉద్యోగుల నియామకం, అవసరాలను తేల్చుతూ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది

జనాభా ఆధారంగా ఏ, బీ, సీ కేటగిరీలు
ఉద్యోగులను హేతుబద్ధీకరిస్తూ ఉత్తర్వులు
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జనాభా ఆధారంగా సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరించడంతో పాటు ఏ కేటగిరీ సచివాలయంలో ఏయే ఉద్యోగులు, ఎంతమంది ఉండాలన్న దానిపై స్పష్టతనిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2,500మంది లోపు జనాభా కలిగిన సచివాలయాలను కేటగిరీ-ఏ కింద, 2,501-3,500 మంది జనాభా ఉంటే కేటగిరీ-బీ కింద, 3,501 మందికి పైబడిన ఉంటే కేటగిరీ-సీ కింద పరిగణించారు. ఏ-కేటగిరీ సచివాలయాల్లో మల్టీపర్పస్ సిబ్బంది ఇద్దరు, టెక్నికల్ సిబ్బంది నలుగురు కలిపి మొత్తం ఆరుగురిని నియమించనున్నారు. బీ-కేటగిరీ సచివాలయాల్లో మల్టీపర్పస్ సిబ్బంది ముగ్గురు, టెక్నికల్ సిబ్బంది నలుగురితో కలిపి ఏడుగురు, సీ-కేటగిరీ సచివాలయాల్లో నలుగురు మల్టీపర్పస్ సిబ్బంది, నలుగురు టెక్నికల్ సిబ్బంది కలిపి మొత్తం 8 మందిని నియమిస్తారు. మల్టీపర్పస్/ సాధారణ అవసరాలకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1-5, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీసు, వార్డు సచివాలయాల్లో
అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వెల్ఫేర్ అండ్ డెవల్‌పమెంట్ కార్యదర్శి, మహిళా పోలీసును నియమిస్తారు. ప్రత్యేక/ టెక్నికల్ సిబ్బందికి సంబంధించి గ్రామ సచివాలయాల్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, అగ్రికల్చర్/హార్టీకల్చర్/సెరికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ/ఫిషరీస్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్‌ను, వార్డు సచివాలయాల్లో వార్డ్ రెవెన్యూ కార్యదర్శి, హెల్త్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి, అమెనిటీస్ కార్యదర్శి, శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కార్యదర్శి, ఎనర్జీ కార్యదర్శులను నియమిస్తారు. ఏ సచివాలయం ఏ కేటగిరీలో ఉందో, అందులో ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తారనే జాబితాను గ్రామ, వార్డు సచివాలయ శాఖ విడుదల చేసింది. ఆయా కేటగిరీలకు సంబంధించి సచివాలయాల్లో సిబ్బంది నియామకాలపై జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.