Dean Son Involved: మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్
ABN , Publish Date - Jul 02 , 2025 | 06:00 AM
మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ర్యాగింగ్ భూతం రెచ్చిపోయింది. ఓ జూనియర్‌ను సీనియర్ వైద్య విద్యార్థులు తీవ్రంగా వేధించారు. దీంతో మనస్థాపం చెందిన బాధిత విద్యార్థి బలవన్మరణానికి ప్రయత్నించాడు

జూనియర్‌కు సీనియర్ల తీవ్ర వేధింపులు
13 మంది వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
సస్పెండైన వారిలో ఎయిమ్స్ డీన్ కుమారుడు
మంగళగిరి, జూలై 1(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ర్యాగింగ్ భూతం రెచ్చిపోయింది. ఓ జూనియర్‌ను సీనియర్ వైద్య విద్యార్థులు తీవ్రంగా వేధించారు. దీంతో మనస్థాపం చెందిన బాధిత విద్యార్థి బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ర్యాగింగ్ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. తిరుపతికి చెందిన బాధిత విద్యార్థి వైద్య విద్యను అభ్యసించేందుకు గతేడాది గుంటూరు జిల్లా, మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్‌లో చేరాడు. అయితే ఎయిమ్స్‌లో సదరు విద్యార్థికి, 2023 బ్యాచ్ సీనియర్లకు మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నట్టు సమాచారం. తమ గురించి పలువురు వైద్య విద్యార్థినుల వద్ద జూనియర్ విద్యార్థి తప్పుగా మాట్లాడినట్టు సీనియర్లు అనుమానించారు. దీంతో కక్ష పెంచుకుని.. ఆ జూనియర్‌ను గత నెల 23 నుంచి 25వ తేదీ వరకు వసతి గృహంలో పలుమార్లు నిర్బంధించి ర్యాగింగ్ పేరిట కొట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన బాధిత విద్యార్థి చేయి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడాన్ని గమనించిన తోటి విద్యార్థులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించడంతో ఆ విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంపై ఢిల్లీలోని యూజీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. స్పందించిన యూజీసీ అధికారులు వెంటనే ఎయిమ్స్ అధికారులతో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ ఉన్నతాధికారుల బృందం విచారణ జరిపి ర్యాగింగ్ జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. బాధ్యులుగా 13 మంది సీనియర్ విద్యార్థులను గుర్తించి సస్పెండ్ చేశారు. వీరిలో మంగళగిరి ఎయిమ్స్ డీన్ కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో మరో ఐదుగురి ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. విచారణ తర్వాత సదరు విద్యార్థులపై కూడా చర్యలకు ఎయిమ్స్ యాజమాన్యం సిద్ధపడుతున్నట్టు సమాచారం.