Sleeping Pods: విశాఖలో స్లీపింగ్ పాడ్స్
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:05 AM
విశాఖ రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం కొత్తగా స్లీపింగ్ పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిని క్యాప్సూల్ హోటల్‌గాను వ్యవహరిస్తున్నారు. ఇది రైల్వే స్టేషన్‌లో...

విశాఖ రైల్వే స్టేషన్‌లో తక్కువ ఖర్చుతో విశ్రాంతి
3గంటలకు రూ.200.. దాటితే రూ.400..రోజంతా ఉండొచ్చు
ఎవరైనా ఉండొచ్చు.. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు
ట్రాన్సిట్ ప్రయాణాలు చేసేవారికి వెసులుబాటు
విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): విశాఖ రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం కొత్తగా ‘స్లీపింగ్ పాడ్స్’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిని ‘క్యాప్సూల్ హోటల్’గాను వ్యవహరిస్తున్నారు. ఇది రైల్వే స్టేషన్‌లో ఒకటో నంబరు ప్లాట్ ఫారంపై మూడో నంబరు గేటును ఆనుకొని మొదటి అంతస్థులో ఉంది. ప్రైవేటు డార్మిటరీ తరహాలో ఉంటుంది.
ఇవీ ప్రత్యేకతలు..
ప్రయాణికులు ఏదైనా రైలు కోసం రెండు, మూడు గంటలు వేచి ఉండాల్సి వస్తే స్టేషన్‌లో అందరికీ వసతి లభించడం లేదు. రిటైరింగ్ రూమ్స్ నిండిపోతున్నాయి. లాంజ్‌లు ఫుల్ అయిపోతున్నాయి. చాలామంది ప్లాట్‌ఫారంపై కూర్చోవడానికి సీట్లు లేక అటూఇటూ తిరగాల్సి వస్తోంది. ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ ‘స్లీపింగ్ పాడ్స్’ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రయాణికులు పడుకోవడానికి ఏసీ సదుపాయంతో బెడ్ ఉంటుంది. వాష్‌రూమ్, స్నాక్ బార్ (టీ, కాఫీ, బిస్కెట్లు) టీవీ చూడడానికి లాంజ్, 24/7 వేడినీరు, వై-ఫై, ట్రావెల్ డెస్క్ వంటి సదుపాయాలు ఉంటాయి. రూ.200 చెల్లిస్తే మూడు గంటలు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. లగేజీకి లాకర్ కూడా ఇస్తారు. మూడు గంటలకు మించి ఉంటే రూ.400 తీసుకుంటారు. ఈ మొత్తంతో 24 గంటల వరకూ ఉండొచ్చు. భార్యాభర్తలు వస్తే వారికి డబుల్ బెడ్ సదుపాయం ఉంది. వీటికైతే మూడు గంటలకు రూ.300, అంతకు మించి ఉంటే రూ.600 వసూలు చేస్తారు. కేవలం మహిళలు మాత్రమే వస్తే వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ బెడ్లను తీసుకోవడానికి ఎటువంటి రైలు టికెట్ గానీ, ప్లాట్‌ఫారం టికెట్ గానీ తీసుకోవలసిన అవసరం లేదు. పర్యాటకులు, వైద్య అవసరాల కోసం వచ్చినవారు, ఆఫీసు సమావేశాల కోసం వచ్చిన వారు కూడా తీసుకోవచ్చు. సింగిల్ బెడ్లు73, డబుల్ బెడ్లు 15 ఉన్నాయి. వీటిలో 18 బెడ్లు పూర్తిగా మహిళల కోసం కేటాయించారు. వారికి ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది.
మంచి ఆలోచన.. చాలా బాగుంది
అమ్మతో కలిసి తిరుపతి నుంచి సింహగిరి ప్రదక్షిణ కోసం విశాఖపట్నం వచ్చాను. ఉదయం ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి రైలు ఎక్కడానికి స్టేషన్‌కు వచ్చాం. కాళ్లు లాగుతున్నాయని, ఏదైనా హోటల్ ఉంటే కాసేపు విశాంత్రి తీసుకుందామని అమ్మ అడిగింది. స్టేషన్‌లో దిగిన వెంటనే ‘క్యాప్సూల్ బెడ్స్’ బోర్డు కనిపించింది. వెంటనే డబుల్ రూమ్ తీసుకొన్నాం. ఇక్కడ సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి.
-పృథ్వీ, తిరుపతి
జోన్‌లో ఇదే మొదటిది..
ఈ తరహా క్యాప్సూల్ ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు దక్షిణ కోస్తా జోన్‌లో విశాఖలోనే మొదటిగా ప్రారంభించాం. పైలట్ ప్రాజెక్టుగా ఓ సంస్థకు ఐదేళ్లకు స్థలం కాంట్రాక్ట్ ఇచ్చాం. ఆదరణ బాగుంటే అదనంగా మరిన్ని ఏర్పాటు చేస్తాం. ఇతర నగరాల్లోనూ పెట్టడానికి ప్రయత్నిస్తాం. తక్కువ ఖర్చుతో ప్రయాణికులకు విశ్రాంతి సదుపాయం కల్పిస్తున్నాం. భద్రత ఉంటుంది. ఆధార్ కార్డు చూపించి బెడ్లు తీసుకోవచ్చు.
-లలిత్ బొహ్రా, డీఆర్‌ఎం, విశాఖ డివిజన్