విద్యుత సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:57 PM
విద్యుత సిబ్బంది చేయవలసిన పని ఇతరులు చేయవలసి రావడంతో రుద్రవరంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

విద్యుత సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
కుటుంబంలో విషాదం
రుద్రవరం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : విద్యుత సిబ్బంది చేయవలసిన పని ఇతరులు చేయవలసి రావడంతో రుద్రవరంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. గ్రామంలో వరి బస్తాల లోడ్‌తో వెళుతున్న లారీలకు విద్యుత సర్వీసు వైర్లు తగులుతుండడంతో సర్వీసు వైరును సరిచేయడానికి 11కేవీ విద్యుతస్తంభాన్ని జనార్దన(42) ఎక్కాడు. సర్వీసు వైరుకు ఉన్న జీ వైరు 11 కేవీ వైరుకు తగలడంతో విద్యుత సరఫరా అయి స్తంభం నుంచి కింద పడ్డాడు. అతడ్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విద్యుత వైర్లు, విద్యుత సర్వీసు వైర్లలో ఏదైనా సమస్య ఉంటే లైనమెన్లు సరి చేయాలి. విద్యుత లైనమెన్లు గ్రామస్తుల సపోర్టు తీసుకుని పనులు చేయిస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసమని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మృతుడు జనార్దన భార్యవిజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
ఎల్‌సీ తీసుకోలేదు: సబ్ ఇంజనీరు రాజశేఖర్
రుద్రవరం సబ్ స్టేషన నుంచి ఎల్‌సీ తీసుకోలేదు. ఏదైనా విద్యుత వైర్లు సరి కానప్పుడు ఎల్‌సీ తప్పకుండా తీసుకోవాలి. ప్రమాద సంఘటన వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. . లైనమెన దగ్గర ఉండి ఈ పని బాధ్యతగా చేయించాల్సిన పని ఇది.