Union Minister Nitin Gadkari: రెండేళ్లలో ఏపీకి లక్ష కోట్ల రోడ్లు
ABN , Publish Date - Aug 03 , 2025 | 03:47 AM
వచ్చే రెండేళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌కు లక్ష కోట్ల రూపాయల విలువైన రహదారి ప్రాజెక్టులను మంజూరు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించారు.

కేంద్రమంత్రి గడ్కరీ వరాల జల్లు
27వేల కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు తక్షణ ఆమోదం
త్వరలో అమెరికాతో ఏపీ రోడ్లు పోటీ.. మాటిస్తే చే సి చూపిస్తా: గడ్కరీ
2,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
రెండు రహదారులు జాతికి అంకితం..
ఏది అడిగినా గడ్కరీ నో చెప్పలేదు
రాష్ట్రానికి 20 పోర్టులు వస్తున్నాయి: సీఎం
ప్రధాని స్ఫూర్తితో అడవిలో రహదారులు
అడగ్గానే సీఎం రూ.50 కోట్లు ఇచ్చారు: పవన్
నితిన్‌గడ్కరీ అమోదించిన అరు ప్రాజెక్టులివీ..
విజయవాడ-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే
విజయవాడ-మచిలీ పట్నం రహదారి ఆరు వరుసలుగా విస్తరణ
వినుకొండ-గుంటూరు
గుంటూరు-నారాకోడూరు
ముద్దనూరు-కడప
విజయవాడ- హైదరాబాద్ రహదారి ఆరు వరుసలుగా అభివృద్ధి
అమరావతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వచ్చే రెండేళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌కు లక్ష కోట్ల రూపాయల విలువైన రహదారి ప్రాజెక్టులను మంజూరు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించారు. శనివారం మంగళగిరి సీ కన్వెన్షన్ వేదికగా జరిగిన సమావేశంలో ఆయన ఏపీపై వరాలజల్లు కురిపించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు కీలక ప్రాజెక్టులకు గడ్కరీ తక్షణ ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల విలువ 27వేల కోట్లపైమాటే. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రూ.2800 కోట్ల విలువైన కొత్త రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.2100 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన రెండు రహదారులను జాతికి అంకి తం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రహదారి ప్రాజెక్టులు పూర్తయితే అమెరికా రోడ్లతో పోటీపడతాయి. నేను మాటల మనిషిని కానేకాదు, మాట ఇచ్చానంటే చేతల్లో చేసి చూపిస్తాను. ఇక భవిష్యత్ అంతా ఆంధ్రప్రదేశ్‌దే.’’నని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల జాబితా చాలా పెద్దగా ఉందంటూ చమత్కరించిన ఆయన, ప్రతి ప్రాజెక్టునూ ఆమోదిస్తామన్నారు.
తొలుత వాటిని తమ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని గడ్కరీ వివరించారు. ఏపీకి మంచి దశ, దిశ, విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు ఉన్నారని, రాష్ట్ర భవిష్యత్తుకు ఢోకా లేదన్నారు. ప్రధానమంత్రి కోరుకుంటున్న ప్రగతి, వికాసం ఏపీలో కనిపిస్తున్నాయన్నారు. రహదారులు, పోర్టులు ఉన్న రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయని, బస్సు, రైలు కన్నా జలమార్గంలోనే రవాణా ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ రంగాలను ఏపీ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తు ఇథనాల్, హైడ్రోజన్‌లదేనని తెలిపారు. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గి, ప్రత్యామ్నాయ, కాలుష్య రహిత ఇంధనాల వినియోగం పెరిగితేనే దేశం మిగతా ప్రపంచంతో వేగంగా పోటీపడగలదని గడ్కరీ అన్నారు. ఏపీలో గ్రీన్‌హైడ్రోజన్ మిషన్ అందుబాటులోకి వస్తే నూతన అభివృద్ధిని చూస్తారని, రైతులకు లక్షల్లో ఆదాయం ఉంటుందని చెప్పారు. విశాఖపట్నంలో హైడ్రోజన్ ప్రాజెక్టును ఓ ప్రైవేటు కంపెనీకి ఇచ్చినట్లు గడ్కరీ చెప్పారు.
ఏపీనీ సొంత రాష్ట్రంలా చూడండి: చంద్రబాబు
నితిన్ గడ్కరీ మాట అంటే మాటే అని, చెప్పారంటే చేసి చూపిస్తారని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. గడ్కరీ ఏపీని కూడా మహారాష్ట్రలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇచ్చే కొత్త రహదారి ప్రాజెక్టులకు ఎలాంటి భూ సేకరణ సమస్య రాకుండా చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘‘మేం ఏది అడిగినా గడ్కరీ ఎప్పుడూ నో చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టుకు ఆక్సీజన్ ఇచ్చింది ఆయనే. అమరావతికి 189 కిలోమీటర్ల ఔటర్‌రింగ్ రోడ్డు ఇచ్చారు. గతంలో రహదారులు నరకప్రాయంగా ఉండేవి. ఇప్పుడు వాటిని బాగుచేస్తున్నాం. హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో రాష్ట్రంలో మరో 20 పోర్టులు రాబోతున్నాయి. మరో 9 ఎయిర్‌పోర్టులు సిద్ధం కావాల్సిఉంది.’’ అని చంద్రబాబు అన్నారు. తాను ఈ రోజును జీవితంలో మరచిపోలేనని, ఉదయం సంక్షేమం కింద రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బు జమచేసి, సాయంత్రం అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను తెచ్చే రహదారి ప్రాజెక్టుల కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. ఏపీపై వరాల జల్లుకురిపించిన నితిన్ గడ్కరీని ఆయన శాలువాతో సత్కరించారు.
ఆ నాయకులతో జాగ్రత్త: రామ్మోహన్ నాయుడు
మామిడికాయలు, తలకాయలు తొక్కుకుంటూ వెళ్లే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును తొక్కుకుంటూ వెళ్లే నాయకులతో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. ఏపీలో ఐదేళ్లు అధికారం ఇస్తే ఓ వ్యక్తి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ‘‘ఆయన సార్‌కు ఏజ్ అయిపోయిందని అంటున్నారు. కానీ ఇక్కడ మా ముఖ్యమంత్రి అహర్నిశలు పనిచేస్తున్నారు. ఇక్కడ కావాల్సింది ఏజ్ కాదు.. టాలెంట్. నువ్వు ఎప్పుడైనా సింగపూర్, ఢిల్లీ, దుబాయ్ వెళ్లావా?’’ అని జగన్‌ను ప్రశ్నించారు.
వికృత మనస్తత్వం వారితో జాగ్రత్త: సత్యప్రసాద్
రాష్ట్ర ప్రజలు వికృత మనస్తత్వం ఉన్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధి చేస్తోందని, దాన్ని ఓర్వలేని వికృత మనస్తత్వం ఉన్న నేతలు ఎమ్మెల్యేలను హత్య చేస్తామని మాట్లాడుతున్నారని, ప్రజలు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అందరికీ నమస్కారం
గడ్కరీ నోట తెలుగు పలుకులు
ఎన్‌హెచ్‌ఆర్- ఏపీ సమావేశంలో ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ప్రసంగం ప్రారంభించారు. తాను ఎలక్ట్రికల్ కారును ప్రారంభించిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘విద్యుత్ వాహనాన్ని ప్రారంభించిన రోజు నన్ను ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగారు. అది మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏమిటని ఆయన సందేహం వెలిబుచ్చారు. కానీ, కానీ ఇప్పుడు కార్లతోపాటు ఎలక్ట్రిక్ బస్సులు కూడా రయ్‌రయ్‌మంటూ తిరుగుతున్నాయి. రహదారి ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాయకుడు శంకర్‌మహదేవన్ పాడిన పాటతో రూపొందించిన ఓ సంక్లిప్త వీడియోను సమావేశంలో మంత్రి ప్రదర్శించారు.
కూటమి 15 ఏళ్లు పదిలంగా ఉండాలి
పవన్ కల్యాణ్
గత ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైతే కూటమి ప్రభుత్వం రహదారులను, వ్యవస్థలను పునరుద్ధరిస్తూ ముందుకు వెళుతోందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి, ఐక్యతకు కూటమి ప్రభుత్వం పునాదులేస్తోందన్నారు. ‘‘కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు బలంగా పనిచేయాలి. అప్పుడే రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం బలంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. అవి రాష్ట్ర భవిష్యత్తును, ఐదు కోట్ల ప్రజల సంక్షేమాన్ని కాపాడతాయి. కూటమి ఐక్యతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కూటమిని దెబ్బతీసే కుట్రలను ఐక్యంగా ఎదుర్కొనాలి.’’ అని తెలిపారు. మోదీ స్ఫూర్తితో ‘అడవితల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టామని ఆయన చెప్పారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తే ఓట్లు వస్తాయా? అన్న కోణంలో తమకు ఆలోచన లేదని, అడవి ప్రాంతాల్లో డోలిమోతలు ఉండకూడదన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. తాను కోరిన వెంటనే ముఖ్యమంత్రిచంద్రబాబు 50 కోట్లు ఇచ్చారని, వాటికి ఉపాధి హామీ కింద వచ్చిన 500 కోట్లు కలిపి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కె. రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.