వైవిధ్యం వైపు పయనం
ABN , Publish Date - Sep 01 , 2024 | 11:59 PM
సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తరువాత ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడిన సోనాక్షి సిన్హా... అటు జీవితంలోనే కాదు... ఇటు కెరీర్ పరంగానూ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మొన్నటివరకు కమర్షియల్ చిత్రాలతో

సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తరువాత ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడిన సోనాక్షి సిన్హా... అటు జీవితంలోనే కాదు... ఇటు కెరీర్ పరంగానూ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మొన్నటివరకు కమర్షియల్ చిత్రాలతో అలరించిన ఆమె... ఇప్పుడు కంటెంట్ ఉన్న కథలకు కటౌట్ అయింది. సంజయ్‌లీలా బన్సాలీ ‘హీరామండీ’ వెబ్‌సిరీ్‌సతో మరో విజయాన్ని అందుకున్న సోనాక్షి అనుభవాలివి.
చాలా నేర్చుకున్నా...
‘హీరామండీ’ షూటింగ్ నాకు మధుర జ్ఞాపకాలు ఎన్నింటినో మిగిల్చింది. ముఖ్యంగా దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన ఒక ఎన్‌సైక్లోపీడియా. సెట్‌లో ఉన్నంతసేపూ తన పనితనాన్ని చూస్తూ ఉండిపోయా. గతంతో పోలిస్తే ఒక నటిగా ఇప్పుడు నేను మరింత సహనంగా, నిలకడగా, మానసికంగా దృఢంగా మారాను. సంజయ్‌తో కలిసి పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. అలాగే ‘హీరామండీ’ ప్రతిష్టాత్మక ‘బూసన్ ఫిలిమ్ ఫెస్టివల్’కు నామినేట్ అవ్వడం నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది.
దేనికదే వైవిధ్యం...
నా కెరీర్ మొదలైంది కమర్షియల్ చిత్రాలతో. కానీ ఇప్పుడు ‘దహాద్, హీరామండీ’ లాంటి కంటెంట్ ప్రాధాన్యంగల పాత్రలనే ఒప్పుకొంటున్నా. వీటిల్లో నేను పోషించిన రోల్స్ దేవికదే ప్రత్యేకం, విభిన్నం. ఒక నటిగా ఇలాంటి ప్రాజెక్ట్‌లు నాకు ఉత్సాహాన్నిస్తాయి. ‘అకీరా’ సినిమా నుంచి ఇలా ఒకదానితో ఒకటి సబంధంలేని వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొంటూ వస్తున్నా. ‘డబుల్ ఎక్స్‌ఎల్’ కావచ్చు... లేదంటే ‘హీరామండీ’ కావచ్చు... అలాంటివే. ఈ వైవిధ్యమే ఒక విజయవంతమైన నటిగా నన్ను నడిపిస్తోంది.
ఆ ప్రోత్సాహమే...
నాడు కమర్షియల్ చిత్రాల్లో నటించిన అనుభవమే నేడు వైవిధ్యభరిత పాత్రలు పోషించడానికి కావల్సిన ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇచ్చింది. ‘రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్’ ప్రాజెక్ట్‌లు సగంలో ఉండగా... ‘లుటేరా’ షూటింగ్ పూర్తయింది. అది నా కెరీర్ ఆరంభంలో చేసిన సినిమా. ఇక అక్కడి నుంచీ ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాను. ఒక దర్శకుడు నన్ను ఏ ప్రాజెక్ట్‌లో అయినా, ఏ జోనర్ రోల్‌కు అయినా తీసుకోగలగాలి. పాత్రల మధ్య అలాంటి వైవిధ్యాన్ని నేను కోరుకున్నాను. అప్పటి నుంచి ఆ దిశగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. బహుశా ప్రేక్షకులు ఇప్పటికీ ఈ విషయాన్ని గ్రహించి ఉంటారు.
అవేవీ పట్టించుకోను...
పదిహేనేళ్ల కెరీర్‌లో నాకు నేను పెట్టుకున్న నియమం... నా చుట్టూ ఎవరేం మాట్లాడుకున్నా పట్టించుకోకూడదని. చేసే పని మీద మనసు లగ్నం చేయాలని. ఇదే అనుసరిస్తూ వస్తున్నా. తల ఎత్తకుండా మన పని మనం చేసుకొంటూ వెళితే... ఒక రోజు అదే మనల్ని లక్ష్యానికి చేరుస్తుందనేది నా నమ్మకం.
అత్యంత చెత్త సలహా...
కెరీర్‌లో ఎవరికైనా ఎత్తుపల్లాలు ఉంటాయి. క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడటానికి స్నేహితులు, సన్నిహితులు తోచిన సలహాలు ఇస్తుంటారు. అలా నాకు వచ్చినవాటిల్లో అత్యంత చెత్త సలహా ఒకటుంది. అదేంటంటే... ‘ఒకవేళ నీ సినిమాలు బాగా ఆడకపోతే ఇక నటించకుండా ఇంట్లో కూర్చో. సరైన ప్రాజెక్ట్ వచ్చేవరకు వేచివుండు’ అని సహనటులు ఒకరు సూచించారు. నా దృష్టిలో అది పనికిమాలిన సలహా. నేను పాటించలేదనుకోండి. ఖాళీగా కూర్చుంటే దేనికీ పరిష్కారం లభించదు కదా!