Parental Responsibility : టీనేజ్.. బాధ్యత పేరెంట్స్‌దే
ABN , Publish Date - Sep 25 , 2024 | 04:07 AM
టీనేజ్... స్వేచ్ఛను కోరుకునే వయసు. నాకన్నీ తెలుసు అని అనిపించేలా చేసే వయస్సు. ఈ సమయంలో పిల్లల చదువు, వారి ఇతర అవసరాలను కల్పించడంతో తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదు.
టీనేజ్... స్వేచ్ఛను కోరుకునే వయసు. నాకన్నీ తెలుసు అని అనిపించేలా చేసే వయస్సు. ఈ సమయంలో పిల్లల చదువు, వారి ఇతర అవసరాలను కల్పించడంతో తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదు. జీవితంలో ఎలా నడుచుకోవాలో చెప్పాలి. సెల్ఫ్ కంట్రోల్ గురించి వివరించాలి. బాధ్యత అనేది ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చేయాలి. బౌండరీస్ పెట్టాలి. అదే సమయంలో ప్రేమను కనబరచాలి. సమయం వచ్చినప్పుడు అభినందించాలి. రోల్‌మోడల్‌గా నిలబడాలి. టీనేజ్ పిల్లలను తీర్చిదిద్దడం పేరెంట్స్‌తో చేతుల్లోనే ఉంటుంది.
బాధ్యత గుర్తెరిగేలా...
టీనేజ్‌లోకి వచ్చాక కూడా పిల్లలను చిన్న పిల్లలుగా లేక పెద్ద వాళ్లుగా ట్రీట్ చేయకూడదు. టీన్ అంటే చిన్న పిల్లాడు కాదు. అదే సమయంలో పెద్ద వాడు కాదు. కాబట్టి పేరెంట్స్ తమ అంచనాలను అడ్జస్ట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించకూడదు. తప్పులు చేయడం వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం ఎక్కువగా జరిగేది టీనేజ్‌లోనే. నెగెటివ్ అనుభవాలను లెర్నింగ్ ఎక్స్‌పెరీయన్సులుగా ఫ్రేం చేసి అందించాలి. పిల్లలు బాధ్యతాయుతంగా ఉన్నామని గట్టిగా చూపించే ప్రయత్నం చేస్తుంటే కొంత ఫ్రీడం ఇవ్వాలి. ఒకవేళ వాళ్ల ఎంపిక తప్పయితే నియంత్రించాలి. ఫైనల్‌గా మీ బిహేవియరే మీకు స్వేచ్ఛను అందించాలా? లేక పరిమితులు విధించాలా అన్నది నిర్ణయిస్తుందని తెలియజెప్పాలి. ఒకవేళ టీనేజ్ పిల్లాడు ఏదైనా పని చేయడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి అనుమతి అడుగుతుంటే నేను అందుకు సిద్ధంగా లేనని పేరెంట్ చెప్పాలి. పిల్లలు తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉండేలా చేయాలి. ఒకవేళ ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే వాళ్లకు తెలిసి వచ్చేలా పరిమితులు విధించాలి. అప్పుడే వారికి నమ్మకం విలువ అర్థమవుతుంది.
బౌండరీస్ ఉండాల్సిందే...
టీనేజ్ పిల్లలకు బౌండరీస్ విధించి వాటికి కట్టుబడి ఉండమని చెప్పడం తప్పేమీ కాదు. తల్లిదండ్రులు ఆ పని చేయాల్సిందే. బౌండరీస్ గురించి పిల్లలతో చర్చించాలి. బౌండరీస్, రూల్స్ పెట్టడంవల్ల వాళ్ల దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నామో అర్థమవుతుంది. మీ నిర్ణయాన్ని మార్చే అవకాశం పిల్లలకు ఇవ్వకూడదు. అలా అని డిక్టేటర్‌గా ఉండకూడదు. అలా ఉంటే పిల్లలు రెబెల్‌గా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే విమర్శించకూడదు. దానివల్ల జరిగే పరిణామాలు, అందులో ఉన్న నిజాల గురించి వివరించాలి.
అలా అని సాధ్యం కాని రూల్స్‌ని పెట్టకూడదు. రాత్రి ఏడున్నర కల్లా పడుకోవాలి. స్నేహితులతో కలిసి ఎక్కడికీ వెళ్లకూడదు వంటి రూల్స్ సరైనవి కావు. టీనేజ్ పిల్లలు స్వేచ్ఛను కోరుకుంటారు. కొంత స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. పిల్లల బలాలు, బలహీనతల పట్ల తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. కొన్నిసార్లు టీనేజ్ పిల్లలు తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు వారితో వాదించకూడదు. నిదానంగా వాళ్లతో మాట్లాడాలి. పేరెంట్స్‌కు కోపం వచ్చేలా ప్రయత్నిస్తారు. కానీ పేరెంట్స్ నియంత్రణ కోల్పోకూడదు. ఒకవేళ పిల్లలు ఒత్తిడితో ఉన్నప్పుడు, అప్‌సెట్‌గా ఉన్నప్పుడు వాళ్లకు కొంత స్పేస్ ఇవ్వాలి. కమ్యునికేషన్ చాలా ముఖ్యం. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోకుండా తప్పు చేశావు అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ పిల్లలు మీతో మాట్లాడకపోతే టెక్ట్స్ మెసేజ్ చేయాలి. మీరెప్పుడూ అందుబాటులో ఉంటారన్న సందేశం ఇవ్వాలి. కమ్యునికేషన్ వల్ల పాజిటివ్ ఫలితాలు పొందవచ్చు.
ప్రేమను వ్యక్తపరచాలి
టీనేజ్ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసేందుకు సమయం కేటాయించాలి. ప్రతి నెలా ఒకరోజు రాత్రి పిల్లలతో కలిసి బోర్డ్‌గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీ పిల్లలు సాహసప్రియులైతే కార్టింగ్‌కు తీసుకెళ్లాలి. రోజూ మార్నింగ్‌వాక్ కలిసి వెళితే ఇంకా బాగుంటుంది. టీనేజ్ పిల్లలు ఎదిగేకొద్దీ స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతారు. అలాంటప్పుడు ఫ్యామిలీ యాక్టివిటీ్‌సలో పాల్గొనమని ఒత్తిడి చేయకూడదు. పిల్లల వ్యక్తిగత ఇష్టాలను కూడా గౌరవించాలి. ఒకవేళ పిల్లలు ఏదైనా సమస్యతో వస్తే వాళ్లు చెప్పేది వినాలి.
కొన్నిసార్లు ఒంటరితనం టీనేజ్ పిల్లలపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. హార్మోన్ల ప్రభావం ఉంటుంది. అవన్నీ తల్లిదండ్రులుగా అర్థం చేసుకుని తోడ్పాటునందించాలి. మిమ్మల్ని పిల్లలు రోల్‌మోడల్‌గా తీసుకుంటారు. పిల్లలు చేప్పేది వింటూ కొంత స్వేచ్ఛను ఇవ్వాలి. కొన్ని బాధ్యతలు అప్పగించాలి. స్కూల్‌లో, ఆటలలో, ఫ్యామిలీ ఈవెంట్స్‌లో వాళ్లు పెట్టే ఎఫర్ట్‌ని గుర్తించినప్పుడు అభినందించాలి. అప్పుడప్పుడు స్నేహితులను ఇంటికి పిలుచుకునే అవకాశాన్ని ఇవ్వాలి. ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్‌కండిషనల్ లవ్‌ని అందించాలి. అది వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.