Sandhya Theatre Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ డిశ్చార్జ్..
ABN , Publish Date - Apr 29 , 2025 | 09:32 PM
Sandhya Theatre Incident: 2024, డిసెంబర్ 4వ తేదీన పుష్ఫ 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

పుష్ఫ 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గత కొన్ని నెలలనుంచి శ్రీతేజ్ సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతూ ఉన్నాడు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డాక్టర్లు అతడ్ని డిశ్చార్జ్ చేశారు. అయితే, నేరుగా ఇంటికి కాకుండా.. రీహాబిలిటేషన్ సెంటర్‌కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అక్కడ 15 రోజుల పాటు ఫిజియోథెరపీ వంటివి నిర్వహించాలని చెప్పారు.
ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్లవచ్చని అన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. బ్రెయిన్ పూర్తిగా రికవరీ కాలేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అంటున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఐదు నెలలుగా శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 15 రోజుల క్రితం ఐసీయూ నుంచి రూముకు షిఫ్ట్ చేశారు. ఇన్ఫెక్షన్లు లేకుండా బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడు కళ్లు తెరిచి చూస్తూ ఉన్నాడు. కానీ, ఎవరినీ గుర్తు పట్టడంలేదు. శ్రీతేజ్ చెల్లెలు అమ్మ ఏది? అని అడుగుతోంది. ఊరెళ్లిందని చెబుతున్నాం. చెల్లెల్ని చూసి కూడా శ్రీతేజ్ గుర్తుపట్టలేదు’ అని అన్నారు.
ఇక, పుష్ఫ ది రూలింగ్ సినిమా 2024, డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 1,642 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. హిందీలోనూ సత్తా చాటింది. హిందీ సినిమాలను వెనక్కు నెట్టి మరీ కలెక్షన్లు కొల్లగొట్టింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. 400 నుంచి 500 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా .. నిర్మాతలకు లాభాల పంట పండించింది.
ఇవి కూడా చదవండి
MBBS Daughter: ఇంటర్ చదివిన వ్యక్తితో MBBS కూతురి ప్రేమ.. సహించలేకపోయిన తండ్రి
Jammu and Kashmir: లోయలో పడ్డ సీఆర్‌పీఎఫ్ వాహనం.. ఇద్దరి పరిస్థితి విషమం..